న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌ను ఇండియా ద్రవ్యోల్బణం డేటా, కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్స్ ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం డేటా ఈ నెల 13న విడుదల కానున్నాయి. దీంతో పాటు ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. మార్కెట్ డైరెక్షన్‌పై వీటి ప్రభావం ఉంటుంది.
రూపాయి–-డాలర్ మారక రేటు, బ్రెంట్ క్రూడ్ ధరపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా కీలక ఆర్థిక డేటా విడుదల ఆగిపోయింది. అమెరికా, ఇండియా, -చైనాల మధ్య వాణిజ్య చర్చలు మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. గత వారం సెన్సెక్స్ 722 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు పడ్డాయి.
షేర్లను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
అక్టోబర్‌లో నికర కొనుగోలుదారులుగా మారిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), నవంబర్‌లో మళ్లీ అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.12,569 కోట్లను ఇండియన్ ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. అక్టోబర్‌లో నికరంగా రూ.14,610 కోట్ల ఇన్‌ఫ్లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్, ఆగస్టు, జులైలో వరుసగా నెట్ అవుట్‌ఫ్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ.1.5 లక్షల కోట్లను ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు.
