- పాంచజన్యం అమలు చేయకుంటే అమరులస్తూపానికి కట్టేయండి: కవిత
- నేను విమర్శించింది మా నాన్నను కాదు.. బీఆర్ఎస్ చీఫ్‌ను
- గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ఉండగా.. పదిసార్లు పేపర్లు ఎట్ల లీక్ అయినయ్?
- నా పార్టీ పేరుపైనా ఎన్నో కుట్రలు చేశారు
- టీయూడబ్ల్యూజే ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు అత్యంత ముఖ్యమైనవి విద్య, వైద్యం అని.. వాటికి పెట్టే ఖర్చుతోనే ఇండ్లు గుల్ల అవుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా అందిస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్కవిత స్పష్టం చేశారు. విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకున్నా.. పాంచజన్యం హామీలు అమలుచేయకపోయినా, రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను చెప్పిన మాట తప్పినా అమరులస్తూపానికి కట్టేసి రాళ్లతో కొట్టాలన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన తండ్రి కేసీఆర్‌ను తిట్టలేదని, రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీ చీఫ్అయిన కేసీఆర్‌నే విమర్శించానని ఆమె పేర్కొన్నారు.
మా నాన్న కేసీఆర్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ, రాజకీయ నేత కేసీఆర్ తో మాత్రం సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నాయి. రాజకీయపరంగా ఆయన తప్పు చేస్తే కచ్చితంగా విమర్శిస్తా. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేయాల్సి ఉండే” అని ఆమె విమర్శించారు. పది సార్లు పేపర్ లీక్ అయిందని కవిత సంచలన ఆరోపణ చేశారు. గొప్ప ఐటీ మినిస్టర్‌గా.. దేశాలు తిరిగిన కేటీఆర్ ఉండగా కూడా పేపర్ లీక్ ఎందుకైందని నిలదీశారు. దాని వల్ల తెలంగాణలో రెండు తరాలు నష్టపోయారని మండిపడ్డారు. లాస్ట్ ఆపర్చునిటీస్ కాస్ట్ వల్ల జరిగిన నష్టం బీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తుందన్నారు. అందుకే కేసీఆర్ ను విమర్శించానని, తప్పు చేస్తే మళ్లీ విమర్శిస్తానని ఆమె తేల్చి చెప్పారు.
పార్టీ పేరుపై కుట్రలు..
పార్టీ పేరు కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎన్నో కుట్రలు జరిగాయని కవిత అన్నారు. వాటన్నింటిని ఎదుర్కొనేందుకే చాలా టాక్టిక్స్ వాడామని చెప్పారు. ఎన్నికల సంఘానికి పంపించిన లిస్టులో తెలంగాణ రక్షణ సేన అనే పేరును మూడో ప్రాధాన్యతగా పెట్టానని, ఎన్నికల సంఘం సరిగ్గా అదే పేరు ఇచ్చిందని అన్నారు. ఇది దైవ నిర్ణయమనే తాను భావిస్తున్నానన్నారు.
బడ్జెట్ సమస్య రాదు..
ఒక పార్టీని పెట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మంది చాలా అంటుంటారని కవిత అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది పార్టీ నడిపే వాళ్ల సిన్సియారిటీని బట్టి ఉంటుందని చెప్పారు. పాంచజన్యం అనే ఐదు అంశాలకు బడ్జెట్ సమస్య ఏమీ లేదని, ప్రభుత్వానికి తమ ప్రాధాన్యతల ప్రకారం కేటాయించుకునేందుకు లక్ష కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఏ విధంగా విద్య, వైద్యానికి ఖర్చు చేయవచ్చో మొన్న ఉగాదికి తాము పెట్టిన బడ్జెట్ లో కూడా వివరించామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఓ తల్లి మాదిరిగా ఆలోచించే గుణం ఉండాలన్నారు.
కేసీఆర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశా..
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన తప్పులను పార్టీ అంతర్గత వేదికల్లో కేసీఆర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని కవిత గుర్తు చేశారు. ఒక పార్టీలో పార్ట్ అండ్ పార్సల్ విధానంలో తాను భాగంగా ఉన్నప్పుడు బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేనని పేర్కొన్నారు.
మహిళలకు ప్రాధాన్యం
టీఆర్ఎస్లో యువత, మహిళలకు కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని కవిత తెలిపారు. మహిళలకు 33 శాతం తగ్గకుం డా సీట్లు ఇస్తామని, ఇంకా సాధ్యమైతే దాన్ని 50 శాతానికి కూడా పెంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కచ్చితంగా పురుషులు నడుపుతున్న పార్టీ కన్నా కూడా తాము పార్టీని మంచిగా నడుపుతామన్నారు.
