పూడికతీత కాదు.. ప్రకృతి ధ్వంసం

పూడికతీత కాదు.. ప్రకృతి ధ్వంసం

కొత్త ప్రాజెక్టుల్లో
అప్పుడే పూడికతీతలా?
ఇసుక తవ్వకాలపై
అసలు చట్టం ఉందా?
గోదావరిలో అక్రమంగా తవ్వినట్టు అర్థమవుతోందని వ్యాఖ్య
26వ తేదీకి విచారణ వాయిదా

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాలపై అసలు చట్టం ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రేలా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారించింది. ఏపీ, తెలంగాణలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని పిటిషన్ తరఫు న్యాయవాది శ్రవణ్.. బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం… రాష్ర్ట ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్రంలో జరిగేది పూడికతీత కాదు.. ప్రకృతి విధ్వంసమని మండిపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలిచింది.

అనుమతి లేకుండా ఎలా తవ్వారు?

రాష్ర్టంలో గోదావరి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వినట్టు అర్థమవుతోందని ఎన్జీటీ అభిప్రాయపడింది. 4.10 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా తవ్వారని ప్రశ్నించింది. రాష్ర్ట ప్రభుత్వ తరఫున లాయర్ సంజీవ్ కుమార్ స్పందిస్తూ.. పూడికతీతకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని వివరించారు. వెంటనే జోక్యం చేసుకున్న బెంచ్.. ఈ స్థాయిలో పూడికతీతకు అనుమతులు అవసరం లేదంటరా అని ప్రశ్నించింది. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు ఇటీవలే పూర్తయితే అప్పుడే పూడికతీత ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూడికతీత కాకుండా, ఇసుకను రూల్స్​కు విరుద్ధంగానే తవ్వినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 26కి వాయిదా వేసింది.