
‘‘బడ్జెట్ లేకుండానే గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్టు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గొల్ల కురుమలను కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు మోసం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి” అని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మీడియాతో మాట్లాడారు. గత జనవరి, ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాలో బడ్జెట్ లేకుండానే 600 యూనిట్ల గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు. దీనిపై పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిధులు లేకుండానే గొర్రెలు కొనుగోలు చేసినట్టు తప్పుడు లెక్కలు చూపించారని కలెక్టర్ విచారణలో తేలిందన్నారు. ఒక్కో యూనిట్ కు గొల్ల కురుమలు తమ వాటాగా రూ.31,250 డీడీ రూపంలో చెల్లిస్తే, దానికి అదనంగా రూ.32 వేలు కలిపి రూ.64 వేలు ఇస్తామంటూ గొల్ల, కురుమలను పశుసంవర్ధక శాఖ అధికారులు, దళారీలు కలిసి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అవకతవకలపై విచారణ చేపట్టి గొల్ల కురుమలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.