నన్ను పదేండ్లు జైల్లో పెట్టేందుకు పాక్ ఆర్మీ కుట్ర: ఇమ్రాన్ ఖాన్

నన్ను పదేండ్లు జైల్లో పెట్టేందుకు పాక్ ఆర్మీ కుట్ర: ఇమ్రాన్ ఖాన్
  •     సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
  •     తన భార్యనూ జైల్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని మండిపాటు

లాహోర్: దేశద్రోహ నేరం కింద రాబోయే పదేండ్లు తనను జైల్లో ఉంచాలని ఆర్మీ కుట్ర పన్నుతోందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు జరిగిన హింసాకాండను సాకుగా చూపి కేసులు పెట్టారని, వాటి ఆధారంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారని సోమవారం ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం వాళ్ల లండన్ ప్లాన్ బయటపడింది. నేను జైల్లో ఉన్నప్పుడు జరిగిన అల్లర్లను సాకుగా చూపి చర్యలకు రెడీ అయ్యారు. నా భార్య బుష్రా బేగంను జైల్లో పెట్టి నన్ను అవమానపర్చాలని ఆర్మీ కుట్ర పన్నుతోంది” అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఆ ప్లాన్ అమలు చేసేటప్పుడు ప్రజా వ్యతిరేకత రాకుండా పీటీఐ కార్యకర్తలపై, ప్రజలపై దాడి చేయడం, మీడియాను నియంత్రించడం వాళ్ల ప్లాన్​లో భాగమని చెప్పుకొచ్చారు. తనను అరెస్ట్ చేసే సమయంలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసి సోషల్ మీడియా యాక్టివిటీలను కంట్రోల్ చేస్తారని అన్నారు. ప్రజల్లో భయాన్ని కలిగించేందుకు ఇండ్లలోకి చొరబడి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి దారుణాలకు పాల్పడతారని ఆర్మీని ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

తొలిసారి కోర్టుకు హాజరైన ఇమ్రాన్ భార్య

వారం కింద ఇమ్రాన్​ అరెస్టయిన తర్వాత ఇస్లామాబాద్​లో హింస చెలరేగింది. ఆయన అనుచరులు లాహోర్‌‌లోని కోర్ కమాండర్ హౌస్‌‌పై దాడి చేసి తగలబెట్టారు. మిలిటరీ సీనియర్ కమాండర్ ఇంటి​పైనా దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మంది పోలీసులు చనిపోయారంటూ ఇమ్రాన్​తో పాటు వందలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ సోమవారం లాహోర్ కోర్టుకు వచ్చారు. ఈ పిటిషన్​పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇమ్రాన్​తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా కోర్టుకు వచ్చారు. అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆమె తొలిసారి కోర్టుకు హాజరయ్యారు.