
ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సైనిక బలం ఉన్న దేశాల్లో ఒకటైన రష్యాను ఒంటరిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు ఒక్కో దేశం ముందుకొస్తోంది. యుద్ధంలో ఏ మాత్రం చలించని ధైర్యంతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుల్లో మరింత బలాన్ని నింపేందుకు జర్మనీ ముందుకొచ్చింది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తమ వంతు సాయంగా ఆయుధాలను పంపుతామని ప్రకటించింది. వెయ్యి యుద్ధ ట్యాంకులు, 500 సర్ఫేస్ టు ఎయిర్ స్టింగర్ క్షిపణులను వీలైనంత త్వరగా ఉక్రెయిన్ చేరవేస్తామని జర్మనీ చాన్సెలర్ కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోందని జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. రష్యా తీరు అన్ని దేశాలను బెదిరించేలా ఉందని, ఈ పరిస్థితుల్లో పుతిన్ దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కు మన వంతు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే 14 ఆర్మ్డ్ వెహికల్స్, పది వేల టన్నుల ఫ్యూయల్ పంపుతామని జర్మనీ ఎకానమీ మంత్రి ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్ కు సుమారు రూ.7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని చేస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధంలో అవసరమయ్యే డిఫెన్సివ్ ఎక్విప్ మెంట్ ను ఉక్రెయిన్ కు పంపేందుకు ఇటలీ ముందుకొచ్చింది. రష్యా యుద్ధోన్మాదాన్ని అడ్డుకోవడానికి 8.6 మిలియన్ డాలర్ల మెషిన్ గన్స్, ఆటోమెటిక్, స్నిపర్ రైఫిల్స్, పిస్టల్స్, మందు గుండు సామాగ్రిని పంపిస్తామని చెక్ రిపబ్లిక్ ప్రకటించింది. అలాగే నెథర్లాండ్స్ 400 యాంటీ ట్యాంక్ వెపన్స్ ను ఉక్రెయిన్ కు సాయంగా పంపుతామని తెలిపింది. ఫ్రాన్స్ కూడా ఆయుధ సాయం చేసే ప్రతిపాదనపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ దేశం యుద్ధానికి ముందే వందల మిలియన్ల విలువ చేసే ఆయుధాలను పంపింది.