
హైదరాబాద్ : బషీర్ బాగ్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు న్యాయం చేయాలని మంత్రి సబిత కార్యాలయం ముట్టడికి ABVP విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు ABVP విద్యార్థులను అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకూ తమ పోరాటం అగదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులు
తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. పి1, పి2కి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారు. తమకు కరోనా తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు చెబుతుండడం ఆందోళన కల్గిస్తోంది. పలువురు విద్యార్థులకు కరోనా చికిత్స మందులు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రి సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులకు నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు క్లాసులు ప్రారంభంకావడంతో చాలామంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. E3, E4 విద్యార్థులు సెలవుల అనంతరం క్యాంపస్ కు చేరుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు మరోసారి చర్చించుకుని కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.