సీతారాముల కల్యాణానికి పద్మశాలీల పట్టువస్త్రాలు

సీతారాముల కల్యాణానికి పద్మశాలీల పట్టువస్త్రాలు

భక్త రామదాసు ధ్యాన మందిరంలో మగ్గంపై నేత
రెండో ఏడాదీ సంప్రదాయం కొనసాగింపు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో ఈ నెల 30న సీతారాముల కల్యాణం, 31న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నేపథ్యంలో కల్యాణమూర్తులు ధరించే పట్టువస్త్రాలను పద్మశాలీలు సిద్ధం చేస్తున్నారు. రంగనాయకుల గుట్టపై ఉన్న భక్తరామదాసు ధ్యాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసుకుని వస్త్రాలను నేస్తున్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జయరాజు, ఆయన ఫ్రెండ్స్​కరుణాకర్, రాపోలు గణేశ్, సురేందర్, శ్రీను, ఉపేందర్, గుర్రం సతీశ్, జానయ్య తదితరులు 15 రోజుల్లో ఈ వస్త్రాలను సిద్ధం చేయనున్నారు.

కల్యాణానికి అమ్మవారికి గంధం రంగు చీర, రామయ్యకు గంధం రంగు పంచె, కండువా తయారు చేస్తున్నారు. వీరితో పాటు లక్ష్మణమూర్తి, ఆంజనేయస్వామిలకు కూడా నేస్తున్నారు. పట్టాభిషేకానికి అమ్మవారికి ఎరుపు రంగు చీర, స్వామికి ఎరుపు రంగు పంచె, కండువా రెడీ చేస్తున్నారు. 5 రంగులతో కూడిన 4,600 పోగులను చీరలకు, 4,600 పోగులతో పంచెలు నేయనున్నారు. గత సంవత్సరం కూడా వీరే సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు నేసి ఇచ్చారు. రెండో సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.