కదిలిస్తే కన్నీళ్లే..! తగ్గుముఖం పట్టిన మున్నేరు

కదిలిస్తే కన్నీళ్లే..! తగ్గుముఖం పట్టిన మున్నేరు
  •     తడిసిన బియ్యం, నిత్యావసరాలు
  •     కొట్టుకుపోయిన సామాన్లు 
  •     బురదమయమైన ఇళ్లను చూసి బోరున విలపించిన మహిళలు
  •     సర్కారు ఆదుకోవాలని వేడుకోలు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం కార్పొరేషన్/వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : రెండు రోజులు ఉధృతంగా ప్రవహించిన మున్నేరు శుక్రవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపునకు గురై పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద కారణంగా కాలనీల్లో ఇళ్లలోకి చేరిన చెత్త చెదారం, బురద, పాడైన ఇంటి సామగ్రిని చూసి బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇండ్లలోని బియ్యం, ఇతర సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. పలు వస్తువులు వరద ధాటికి కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలోని ఇండ్ల ప్రహరీలు కూలిపోయాయి. దీంతో ఎవరినీ కదిలించినా కంట కన్నీరే వస్తోంది. ఎగువన ఉన్న పాకాల గేట్లు ఎత్తడంతో ఖమ్మం నగరంలోని మున్నేరు నదిలో30 అడుగుల మేర పారింది.

ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 46, 47, 48 డివిజన్లలోని బొక్కల గడ్డ, మంచికంటి నగర్, మోతీనగర్, పద్మావతి నగర్, జలగం నగర్, జూబ్లీపురా, సారథి నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ప్రకాశ్​నగర్ లలోని నిరుపేదల ఇండ్లు వరదతో నీట మునిగాయి. ఇళ్లకు వచ్చిన బాధితులు తినడానికి తిండి లేక, విద్యుత్ లేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఆవరణలో నిలిచిన బురదను, చెత్తను తొలగించుకున్నారు. కట్టుకునే బట్టలు లేక ఉతికి ఆరేసుకునే పనిలో పడ్డారు. పునరావాస కేంద్రాల్లోనే తిన్నారు. నల్లాలు రాక తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాల్వ ఒడ్డున ఉన్న రేపాకుల సైదులు  మినరల్ ​వాటర్ ను బాధితులకు ఉచితంగా అందించాడు.

తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు మాత్రం ఇప్పుడే ఇండ్లలోకి వెళ్లొద్దు అంటున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వరద ముంపులోనే గ్రామాలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. వానలు తగ్గినా వరద ఉధృతి మాత్రం తగ్గలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలతో బూర్గంపహాడ్, చర్ల, పినపాక, అశ్వాపురం, దుమ్ముగూడెం, గుండాల మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపహాడ్​లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పాల్వంచ మండలంలోని నాగారం వద్ద రెండేళ్ల కింద రూ.12.74కోట్లతో నిర్మించిన చెక్​డ్యాం కిన్నెరసాని వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్లు నాసిరకం పనులు, ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే ఈ నష్టం జరిగిందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

సీతమ్మ బ్యారెజ్ కు ​రోజురోజుకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పునరావాస కేంద్రాలను కలెక్టర్ ప్రియాంక అలా, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించారు. గుండాల మండలం ముత్తాపురం గ్రామంలో 45 వరద బాధిత కుటుంబాలకు గుండాలకు చెందిన మానాల భద్రయ్య కుమారులు మానాల వెంకటేశ్వర్లు, నారాయణ మూర్తి, ప్రభాకర్, వీరన్న రూ.లక్ష విలువైన నిత్యావసరాలను అందజేశారు.