ఢిల్లీ లిక్కర్ స్కామ్​.. దినేశ్ అరోరా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్​.. దినేశ్ అరోరా అరెస్ట్
  • సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చిన ఈడీ
  • నిందితుల్ని కాపాడాలని అరోరా చూస్తున్నరు 
  • పిళ్లై, సిసోడియాకు భేటీ ఏర్పాటు చేశారు
  • కోర్టులో ఈడీ వాదనలు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి దూకుడు పెంచింది. స్కామ్​కు సంబంధించి సీబీఐ కేసులో అప్రూవర్​గా మారిన దినేశ్ అరోరాను మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శుక్రవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు లాయర్​ జోసెఫ్ హుస్సేన్ వాదిస్తూ.. దినేశ్ ద్వారానే సౌత్ గ్రూపు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ముడుపులు అందాయని ఆరోపించారు. 2019–21 మధ్య లిక్కర్ పాలసీపై జరిగిన10 కీలక మీటింగ్స్ లో దినేశ్ కూడా పాల్గొన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లైకి, సిసోడియాకు ఒబెరాయ్ హోటల్​లో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. సౌత్ గ్రూప్​కి రిటైల్ జోన్స్ దక్కడంలో దినేశ్ కీలక పాత్ర పోషించారన్నారు. పిళ్లై తన వాంగ్మూలంలో దినేశ్ పాత్రను ప్రస్తావించారని తెలిపారు. సీబీఐ కేసులో అప్రూవర్​గా మారినా.. ఈడీ కేసులో విచారించాల్సిన అవసరం ఉందని అధికారులు కోర్టుకు తెలిపారు. రూ.2.20 కోట్లను దినేశ్ ద్వారా సిసోడియాకు అమిత్ అరోరా ఇచ్చారన్నారు. దినేశ్ విచారణకు సహకరించలేదని, రూ. 9.2 కోట్ల గురించి నోరు విప్పడం లేదన్నారు. నిందితుల్లో కొందరిని కాపాడాలని చూస్తున్నారని, ఆయనను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.  

 అప్రూవర్ గా మారినా అరెస్ట్: అరోరా అడ్వకేట్ 

దినేశ్ అరోరాను ఈడీ కస్టడీకి కోరడాన్ని ఆయన న్యాయవాది వికాస్ పహవా వ్యతిరేకించారు. సీబీఐ కేసులో దినేశ్ అప్రూవర్ గా మారాడని, అనేకసార్లు ఆయన వాంగ్మూలాన్ని దర్యాప్తు సంస్థలు రికార్డ్ చేశాయన్నారు. ఈడీ దాఖలు చేసిఏన ఈసీఐఆర్ లో దినేశ్ పేరే లేదన్నారు. అప్రూవర్ గా మారి లిక్కర్ స్కాం సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు అరెస్ట్ చేయడం సరికాదని వాదించారు. ఈడీ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. అప్రూవర్ గా మారిన తర్వాత కూడా దినేశ్ కొన్ని విషయాలు దాచారని, చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామన్నారు. వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్.. దినేశ్ ను నాలుగు రోజుల కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.   

మరో రూ.52 కోట్ల ఆస్తులు జప్తు 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, వ్యాపారవేత్తలు అమన్ దీప్ సింగ్ ధల్, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, మరిందరికి చెందిన రూ. 52.24 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ శుక్రవారం ట్వీట్ చేసింది. తాజాగా జప్తు చేసిన వాటిలో స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయి. దీంతో లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 128.78 కోట్లకు చేరింది.