
మార్కెట్లో కొత్త ఐఫోన్ ఏదొచ్చినా మనోడే ఫస్ట్ కస్టమర్
బీహార్ లో మద్య నిషేధమే ఆదాయ మార్గం
పాట్నాలోని ప్రైవేటు యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న అతుల్ సింగ్ (28) అరెస్ట్
పాట్నా: ఒక వైపు ప్రైవేటుగా ఎంబీఏ చదువుతూ బతుకు దెరువు కోసం కోళ్ల పరిశ్రమ పెట్టుకుని జీవిస్తున్నాడు అతుల్ సింగ్(28). కరోనా కు లాక్ డౌన్ కు ముందు అంటు వ్యాధులు ప్రబలడంతో కోళ్ల పరిశ్రమ కుదేలైపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. అప్పుల వారి ఒత్తిడి పెరడంతో సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. వారణాశి నుండి కొందరు రహస్యంగా మద్యం బాటిళ్లు తెచ్చుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించాడు. బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉండడంతో ఇలా అడ్డదారిలో రహస్యంగా సులభంగా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుసుకున్నాడు. తానెందుకు చేయకూడదనుకుని ఒకసారి స్వయంగా వెళ్లి తన వద్ద ఉన్న డబ్బుతో మద్యం బాటిళ్లు కొని.. ఎవరూ గుర్తించకుండా బీహార్ కు తెచ్చుకుని రెట్టింపు డబ్బులకు అమ్మేశాడు. ఒక్కసారే రెట్టింపు ఆదాయం రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు.
లాక్ డౌన్ సమయంలోనూ ఆగని బిజినెస్
లాక్ డౌన్ తో అందరూ ఇబ్బందిపడుతుంటే అప్పటికే బాగా డబ్బులు సంపాదించిన అతుల్ సింగ్ తన వద్ద పెట్టుకున్న భారీ స్టాక్ ను మరింత ఎక్కువ ధరకు అమ్ముకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో కారు కొనేసి వేగంగా వారణాశికి వెళ్లి.. ఎవరికీ అనుమానం రాని రీతిలో వేర్వేరు షాపుల్లో కొద్ది కొద్దిగా మద్యం బాటిళ్లు కొని.. వాటిని వేరే వస్తువుల మాదిరి ప్యాక్ చేసి ట్రాన్స్ పోర్టులో బుక్ చేసి వచ్చేసేవాడు. తన అడ్రస్ కు వస్తే పోలీసులకు పట్టుపడతానని స్నేహితుల అడ్రస్ కు తెప్పించుకుని అమ్ముకునేవాడు. అమాయకులను గుర్తించి వారికి ఒక్కో ఆర్డర్ కు 500 చొప్పున ఇచ్చి డెలివరీ ఏజెంట్లుగా చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని బుక్ చేసుకుంటూ మొత్తం 20 మందిని తన డెలివరీ ఏజెంట్లుగా చేసుకుని నిరాటంకంగా బిజినెస్ చేసుకుంటున్నాడు.
ఖరీదైన బైకుపై తిరగడంతో హాట్ టాపిక్
ఎవరికీ అనుమానం రాకుండా మద్యం స్మగ్లింగ్ చేస్తున్న అతుల్ సింగ్ కొద్ది రోజుల్లోనే ఖరీదైన బైకుపై తిరగడం ప్రారంభించడంతో అతని పాత స్నేహితుల దృష్టిలో పడింది. ఏం బిజినెస్ చేస్తున్నాడో ఎవరికీ చెప్పడు కానీ… బాగా డబ్బులు సంపాదిస్తున్నాడన్న విషయం ఆనోటా.. ఈనోటా పోలీసుల వరకు వెళ్లింది. ఎందుకైనా మంచిదని నిఘా పెట్టిన పోలీసులకు అతుల్ సింగ్ ఖరీదైన బైకులే కాదు.. మరికొన్ని లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడని తేలింది.
అనుమానంతో రెక్కీ చేసి.. సోదా చేసి పోలీసుల షాక్
అతుల్ సింగ్ నడవడిక, కార్యకలాపాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు రెక్కీ చేశారు. పాట్నా నగరంలో అతను అద్దెకున్న ఇంటికి కొన్ని పార్శిళ్లు రావడంతో అవేమిటో తెలుసుకుందాని శుక్రవారం రాత్రి పోలీసులు సోదా చేశారు. బాక్సులలో ప్యాకింగ్ చేసిన మద్యం బాటిళ్లు కనిపించడంతో పోలీసులు అలర్టయ్యారు. పార్శిల్ లు చెక్ చేసుకుంటున్న ముగ్గురు పార్టనర్లను వెంటనే అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. మొత్తం కక్కేశారు. అతుల్ సింగ్ ను అదుపులోకి తీసుకుని అతని డైరీలు.. ఫోన్ లో ఛాటింగ్ చేసిన వివరాలు చూసి పోలీసులు ఖంగు తిన్నారు. ఎందుకంటే ఏకంగా రోజుకు 9 లక్షల రూపాయలు పైగానే సంపాదిస్తున్నట్లు తేలింది. డైరీలో దొరికిన వివరాల ప్రకారం దాదాపు 40 మందిని డెలివరీ ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. వారణాసిలో ఉంటున్న నలుగురు స్మగ్లర్ల ద్వారా బీహార్ కు అక్రమంగా మద్యం బాటిళ్లు తెప్పించడం.. వాటిని ఎవరికీ అనుమానం రాని రీతిలో డోర్ డెలివరీ చేసుకుంటూ వస్తున్నాడు. అరెస్టయ్యే సమయంలో అతుల్ సింగ్ అద్దెకున్న ఇంట్లో ఖరీదైన స్పోర్ట్స్ బైకులు, లగ్జరీ కారు కూడా కనిపించింది. దాదాపు 21 లక్షల రూపాయల విలువైన 1100 లీటర్ల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. స్మగ్లింగ్ వ్యవహారం డైరీలో లెక్కలు రాసుకుంటూ వస్తున్నాడు. దాని ప్రకారం రోజుకు 9 లక్షలకుపైగా ఆదాయం గడిస్తున్నట్లు పోలీసులు అంచనా వేశారు. తేరగా అలా సంపాదించిన డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు కొని విలాసవంతంగా జీవిస్తూ హైలెవెల్ వ్యక్తులతో పరిచయాలు చేసుకున్నాడు. మార్కెట్లోకి వచ్చే ప్రతి ఐ ఫోన్ ను కొని.. ఎప్పటికప్పుడు నెంబర్లు మార్చేవాడు. అతుల్ సింగ్ అక్రమ మద్యం వ్యాపారంలో పాలు పంచుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఇంద్రజిత్ కుమార్, సంజీవ్ కుమార్, విశాల్ కుమార్ లను అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం?
కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు
బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరికన్లు