ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే

ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే

దుబ్బాక ఉప ఎన్నికల్లో TRS కు 35వేల మెజార్టీ తగ్గదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపేనన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో  BCలకు 50 శాతం సీట్లు ఇస్తామనటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక బడుగుబాలహీన వర్గాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నంతగా ఎక్కడ ఇవ్వడం లేదని  స్పష్టం చేశారు. ఏ ఎన్నిక అయినా బీసీలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ ముందు జరిగిన ధర్నాలను ఎవరూ మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వర్గాలకు తప్ప బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

దుబ్బాకలో ప్రతిపక్షాలు చేసిన హంగామా ఇంతా అంతా కాదన్న తలసాని.. 10వ తేదీన ఫలితాలను ప్రజలు చూడాలన్నారు. తెలంగాణ లో భారీ వర్షాలు కురిస్తే కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మేమే తీర్మానం చేసి పంపామన్నారు.

మరోవైపు బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తలసాని. బీజేపీ వాళ్లు గాలిలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు..రెండు సీట్లు గెలిచి మేమే ప్రత్యామ్నాయం అంటే ఏలా అని అన్నారు. చూసుకుందాం అని సవాల్ విసురుతారు.. మాకు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు.. మేము కూడా చూసుకుందాం అంటే ఎట్లా వుంటుంది. సీఎం కేసీఆర్ ను ఏక వచనం తో మాట్లాడితే మేము డైరెక్ట్ ప్రధాని మీదనే మాట్లాడుతామన్నారు.