గాజాలో గుక్కెడు నీళ్లు కూడా దొరకట్లే.. తిండి లేక అలమటిస్తున్న ప్రజలు

గాజాలో గుక్కెడు నీళ్లు కూడా దొరకట్లే.. తిండి లేక అలమటిస్తున్న ప్రజలు
  • 23 లక్షల మందిపై తీవ్ర ప్రభావం

టెల్​అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో 23 లక్షల మందికి సరైన తిండి, నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు. ఎక్కడి నుంచి.. ఏ రాకెట్ దూసుకొస్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నార్త్ గాజా నుంచి సౌత్ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియులకు ఇప్పటికే ఇజ్రాయెల్ ఆదేశించింది. తాము చెప్పిన రూట్​లో వెళ్తే ఎలాంటి దాడులు చేయమని స్పష్టం చేసింది. దీంతో పాలస్తీనియులు కట్టుబట్టలతో.. ఖాళీ కడుపులతో ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. 

మరికొందరు హాస్పిటల్స్​లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే గాయపడిన వారితో అన్ని హాస్పిటల్స్ కిక్కిరిసిపోయాయి. దాదాపు గాజా సగం ఖాళీ అయింది. గాజా సిటీలో అండర్ గ్రౌండ్ రహస్య స్థావరాలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది. ఫ్యూయెల్​ సప్లై కూడా ఇజ్రాయెల్ ఆపేసింది. దీంతో గాజాలో ఉన్న ఒకే ఒక్క కరెంట్ ప్లాంట్ మూతపడింది. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంలో ఉంది. ప్రాణ భయంతో వ్యాపారులు కూడా షాపులు మూసేశారు. 

దీంతో తినడానికి కనీస రొట్టెలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. వృద్ధులతో పాటు చిన్నారులు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.

మేం ఏం పాపం చేశామన్న బాధితులు

ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే నీరు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడింది. వారం రోజులుగా ఫుడ్, మెడిసిన్స్, ఫ్యూయెల్ సప్లై ఆగిపోయింది. కరెంట్ కూడా లేకపోవడంతో వాటర్ ప్లాంట్లు పని చేయడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల దొరికే నీళ్లు కూడా కలుషితం అయ్యాయి. ‘మా కుటుంబంలో ఆరుగురం ఉన్నాం. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవడానికి గాజా వదిలి వెళ్లిపోతున్నాం. చిమ్మ చీకట్లో దారి కనిపించకపోయినా సౌత్​కు బయలుదేరాం. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. మేము ఎవరినీ చంపలేదు.. మాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది” అని గాజా సిటీకి చెందిన హైఫా ఖమీస్ అల్ షురాఫా ప్రశ్నించింది.  ‘నా ఇద్దరి పిల్లలకు తాగేందుకు నీళ్లు ఇస్తున్న. నేను మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి  గొంతు తడుపుకుంటున్న. రెండు రోజులకోసారి యూరిన్ పోస్తున్న’ అని 25 ఏండ్ల అమల్ అబు యహియా అనే గర్భిణి వాపోయింది.