యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టులో ఊరట

యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు చేయడానికి సంబంధించిన చట్టపరమైన ప్రశ్నలను పరిశీలించవలసిన అవసరం ఉన్నట్లు భావించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్‌వీ రమణ ,  హిమ కోహ్లీ, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

జనవరి 27, 2007న గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. "హిందూ యువ వాహిని" కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ పర్వేజ్ పర్వాజ్ ఆరోపించారు. ఆదిత్యనాథ్ ద్వేషపూరిత ప్రసంగం చేసిన తర్వాత గోరఖ్‌పూర్‌లో ఆ రోజు అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని పిటిషన్ లో పేర్కొన్నారు.