అసంతృప్తుల దారెటు ?

అసంతృప్తుల దారెటు ?
  •  టికెట్‌‌‌‌ దక్కకపోవడంతో అంతర్మథనంలో ఆశావహులు
  • ఎవరికి వారుగా మీటింగులు, క్యాడర్‌‌‌‌తో చర్చలు
  • ఇతర పార్టీల వైపు కొందరు, సందిగ్ధంలో మరికొందరు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ టికెట్‌‌‌‌ ఆశించి భంగపడ్డ లీడర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్‌‌‌‌ సాధించేందుకు చివరి వరకు గట్టిగానే ప్రయత్నించినా నిరాశే మిగలడంతో భవిష్యత్‌‌‌‌ కార్యాచరణపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో నిలవాలన్న లక్ష్యంతో కొందరు పార్టీ మారే ప్రయత్నాల్లో ఉండగా, మరికొందరు ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుండగా బీజేపీ నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

ఫార్వార్డ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ నుంచి జంగా.. ఇండిపెండెంట్‌‌‌‌గా ఇనుగాల ?

ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్‌‌‌‌ డోర్నకల్‌‌‌‌ మినహా మిగతా 11  స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. టికెట్ల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్‌‌‌‌లో గందరగోళం మొదలైంది. టికెట్‌‌‌‌ ఆశించి భంగపడ్డ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ టికెట్‌‌‌‌ కోసం ప్రయత్నం చేసిన జంగా రాఘవరెడ్డి టికెట్‌‌‌‌ దక్కకపోవడంతో టేకులగూడెంలోని తన మామిడితోటలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఆయన ఆల్‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక పరకాల టికెట్‌‌‌‌ దక్కని ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఇండిపెండెంట్‌‌‌‌గా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌‌‌‌లో బలరాం నాయక్, బెల్లయ్యనాయక్‌‌‌‌, వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్, పరంజ్యోతికి కూడా నిరాశే ఎదురైంది. వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్, పరంజ్యోతి సోమవారం వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి అసంతృప్తిని వెళ్లగక్కారు.

పార్టీ ప్రోగ్రామ్స్‌‌‌‌కు దూరంగా బీజేపీ లీడర్లు

బీజేపీ పరకాల, ములుగు, నర్సంపేట మినహా మిగతా 9 స్థానాల్లో తమ క్యాండిడేట్లను ప్రకటించింది. వరంగల్ పశ్చిమ టికెట్‌‌‌‌ ఆశించిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌‌‌‌రెడ్డికి నిరాశే మిగిలింది. ఇక్కడ బీజేపీ టికెట్‌‌‌‌ రావు పద్మకు కేటాయించడంతో అసంతృప్తికి గురైన రాకేశ్‌‌‌‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇండిపెండెంట్‌‌‌‌గా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. 

అసంతృప్తులకు బుజ్జగింపులు

టికెట్‌‌‌‌ దక్కకపోవడంతో నిరాశలో ఉన్న అసంతృప్తులను ఆ పార్టీ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. లీడర్లను నేరుగా కలుస్తూ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్‌‌‌‌లోని కొందరు లీడర్లు ససేమిరా అంటున్నట్లు సమాచారం. మరి కొద్దిరోజుల్లోనే ఎలక్షన్లు ఉండడం, అసంతృప్త నేతలు బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుండడంతో తమ గెలుపుపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని క్యాండిడేట్లు ఆందోళన చెందుతున్నారు. 

సభ్యత్వం లేని వ్యక్తికి  టికెట్‌‌‌‌ ఎట్లిస్తరు ?

హసన్‌‌‌‌పర్తి, వెలుగు : పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తికి టికెట్‌‌‌‌ ఎలా ఇస్తారని కాంగ్రెస్‌‌‌‌ వర్ధన్నపేట కో ఆర్డినేటర్‌‌‌‌ నమిండ్ల శ్రీనివాస్‌‌‌‌ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌పర్తిలో సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం 13 ఏళ్లుగా కష్టపడిన తమను కాదని కేఆర్‌‌‌‌.నాగరాజుకు టికెట్‌‌‌‌ ఇవ్వడం సరికాదన్నారు. వర్ధన్నపేట టికెట్‌‌‌‌ విషయంలో హైకమాండ్‌‌‌‌ మరోసారి ఆలోచన చేయాలని కోరారు. కార్యకర్తల సూచన మేరకు భవిష్యత్‌‌‌‌ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

మాదిగ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది

కాశీబుగ్గ, వెలుగు : వర్ధన్నపేటలో మాదిగ సామాజికవర్గం అసంతృప్తితో ఉందని కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌ పరంజ్యోతి చెప్పారు. సోమవారం తన క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. వర్ధన్నపేటలో తక్కువ జనాభా కలిగిన సామాజికి వర్గానికి టికెట్‌‌‌‌ కేటాయించడం సరికాదన్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని హైకమాండ్‌‌‌‌ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.