
- లక్షద్వీప్‌లో రూ. 1,150 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కవరత్తి/త్రిస్సూర్ : లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ చిన్నగానే ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజల మనసులు మాత్రం పెద్దవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం లక్షద్వీప్‌లో రూ. 1,150 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తమిళనాడు పర్యటన తర్వాత మంగళవారం సాయంత్రం లక్షద్వీప్ చేరుకున్న మోదీ.. బుధవారం అగత్తి, బంగారమ్, కవరత్తి దీవుల్లోని స్థానికులను కలిసి మాట్లాడారు. ముస్లింలు మెజార్టీగా ఉన్న లక్షద్వీప్ లో తనకు ప్రజలు ఘన స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ, ఎనర్జీ, జల వనరులు, వైద్యం, విద్యా రంగాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. లక్షద్వీప్ మహిళలు, పిల్లలతో సహా వందలాది మందిని ఉద్దేశిస్తూ.. వారంతా తన ‘కుడుంబంగంగళ్ (కుటుంబ సభ్యులు)’ అని మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల మనసులు సముద్రమంత లోతైనవని అభివర్ణించారు. స్వదేశ్ దర్శన్ స్కీం కింద ప్రత్యేక డెవలప్ మెంట్ ప్లాన్ అమలుచేస్తామని ప్రకటించారు. కద్మత్, సుహేలి దీవుల్లో రెండు బ్లూ ఫ్లాగ్ బీచ్ లు, వాటర్ విల్లా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. లక్షద్వీప్ కు గత ఐదేండ్లలో టూరిస్టుల రాక ఐదు రెట్లు పెరిగిందన్నారు. విదేశాల్లో టూర్లకు వెళ్లే ముందు దేశ ప్రజలు మన దేశంలోని కనీసం 15 ప్రాంతాలను సందర్శించాలని కోరారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..
గత ప్రభుత్వాలు తమ పార్టీలను డెవలప్ చేసుకున్నాయి కానీ లక్షద్వీప్ వంటి సముద్రంలోని ప్రాంతాలను, బార్డర్ ఏరియాలను పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. 2020 పంద్రాగస్టు స్పీచ్‌లో తాను ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నానని మోదీ చెప్పారు. ‘‘వచ్చే వెయ్యి రోజుల్లో లక్షద్వీప్‌కు ఫాస్ట్ ఇంటర్నెట్ సౌలతును కల్పిస్తానని 2020లో గ్యారంటీ ఇచ్చాను. నేడు కొచ్చి–లక్షద్వీప్ సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి ఆ మాటను నిలబెట్టుకున్నాను” అని ఆయన వెల్లడించారు. ఇకపై లక్షద్వీప్ లో ఇంటర్నెట్ స్పీడ్ 100 రెట్లు పెరుగుతుందన్నారు. అనంతరం స్టూడెంట్లకు ల్యాప్ టాప్ లు, సైకిళ్లను, రైతులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాని అందజేశారు. కార్యక్రమంలో లక్షద్వీప్ ఎల్జీ ప్రఫుల్ పటేల్, ఎంపీ ముహమ్మద్ ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.