ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలోని నాయకుల మధ్య అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ నేతలు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాణాప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. నర్సంపేట టౌన్ బీజేపీ కార్యాలయంపై రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. పార్టీ ఆఫీసులోని అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు మందే నర్సంపేట బీజేపీలో గ్రూపు వార్ బయటపడింది. నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడి ఘటన తర్వాత ఒక వర్గంపై మరో వర్గం నాయకులు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
