
- గ్రౌండ్స్ కేటాయించడంలో సర్కారు విఫలం
- చేతులెత్తేస్తున్న ప్రైవేటు కోచింగ్ ఇనిస్టిట్యూట్లు
ఎల్ బీ నగర్, వెలుగు: పోలీస్ కొలువు కొట్టాలంటే రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఈవెంట్లను క్లియర్ చేయాల్సిందే. రాత పరీక్షలో మెరిట్ సాధించినప్పటికీ.. ఫిజికల్ ఈవెంట్లలో రాణించలేకపోతే ఉద్యోగం రానట్టే. అయితే ఫిజికల్ ఈవెంట్స్ కొట్టాలంటే ప్రాక్టీస్ తప్పనిసరి. నెలల కొద్దీ ప్రాక్టీస్ చేసినప్పటికీ ఈవెంట్స్ క్లియర్ చేయడం మామూలు విషయం కాదు. కానీ సరైన గ్రౌండ్స్ లేకపోవడంతో అభ్యర్థులు సరిగా ప్రాక్టీస్చేసుకోలేకపోతున్నారు. మొదట ఈవెంట్స్ బాధ్యత తీసుకున్న కోచింగ్ సెంటర్లు చేతులెత్తేశాయి. ప్రభుత్వం సైతం సిటీలో తగినన్ని గ్రౌండ్లను ఏర్పాటుచేయలేకపోవడంతో ప్రాక్టీస్ చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రాక్టీస్‌ను పట్టించుకోని కోచింగ్ సెంటర్లు..
554 ఎస్ఐ,15,644 కానిస్టేబుల్,614 ఎక్సైజ్ కానిస్టేబుల్,63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్ పోస్టులకు మొత్తం 5,07,840 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఎస్ఐ,
కానిస్టేబుల్ ఈ రెండింటికి కూడా పురుషులు 1600 మీటర్ల రన్నింగ్‌తో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షాట్‌పుట్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. మహిళలు 800 మీటర్ల రన్నింగ్, 2.5మీటర్ల లాంగ్ జంప్, 4 మీటర్ల షార్ట్ పుట్ ఈవెంట్లలో పాస్ కావాలి. ఇందులో క్వాలిఫై అయిన వారే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి సిటీలో సరైన గ్రౌండ్స్ కేటాయించకపోవడంతో సరిగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నారు. ఈవెంట్స్ బాధ్యత అంతా తమదేనని మొదట చెప్పి అభ్యర్థులను జాయిన్ చేసుకున్న దిల్సుఖ్నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లోని పలు కోచింగ్ సెంటర్లు గ్రౌండ్ ఫెసిలిటీ లేకపోవడంతో మీరే చేసుకోవాలని చెప్పేస్తున్నాయి. ఒకటి, రెండు మినహా ఏ ఒక్క ఇనిస్టిట్యూట్‌కు కూడా గ్రౌండ్స్ లేకపోవడంతో అందులో చేరిన అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
గ్రౌండ్స్ కోసం గొడవలు..
దిల్‌సుఖ్‌నగర్‌లోనే ఎక్కువగా కోచింగ్ సెంటర్లు ఉండడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. వారికి సరైన గ్రౌండ్ సదుపాయం లేక కొత్తపేటలోని వీఎం(విక్టోరియా మెమోరియల్) హోం ట్రస్ట్ గ్రౌండ్లో ఇటీవల ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే తమ పిల్లలు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని వీఎం హోం ఓల్డ్ స్టూడెంట్లు, నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో గొడవలు జరిగి పోలీసు కేసుల వరకూ వెళ్లాయి. సొంతంగా ప్రాక్టీస్ చేసుకునేవారు వేరే దిక్కు లేక డీర్ పార్క్, చెరువు గట్లు, పార్క్ స్థలాల్లో రన్నింగ్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్
మెంట్లో ఉన్న కొందరు వాకర్స్.. అభ్యర్థుల ప్రాక్టీస్‌కు హెల్ప్ చేస్తున్నారు. అశోక్‌నగర్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలోనూ భారీ సంఖ్యలో యువత దొరికిన కొద్ది ప్లేస్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలి
సిటీలో ఎక్కువగా కోచింగ్ సెంటర్లు ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు వస్తుంటారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్చేసుకునేవారు వేలల్లో ఉండటంతో వారందరికీ గ్రౌండ్ ఫెసిలిటీ కల్పించలేం. ఇలాంటి సమయంలో ఎమర్జెన్సీ కింద ట్రస్ట్ గ్రౌండ్లు కానీ, ఇతర ప్రైవేటు గ్రౌండ్లు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేందుకు ఆవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలి. ప్రస్తుతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం, సాయంత్రం సుమారు వెయ్యి మందికి అవకాశం కల్పిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. భవిష్యత్‌లో ఇలా గ్రౌండ్స్ విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. - దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎల్ బీనగర్
వీఎం హోంలో ఉండే పిల్లలకు ఇబ్బంది
వీఎం హోం భూమి అనాథలకు సంబంధించిన ట్రస్టుకు చెందుతుంది. ఇక్కడ ఉండేవారంతా అనాథ పిల్లలే. చాలా కాలం నుంచి మార్నింగ్ వాకింగ్ వచ్చే వారితో ఇక్కడి స్టూడెంట్లకు కొంత ఇబ్బందిగా ఉంటోంది. వాకర్స్ ను పంపించలేకపోతున్నాం. ప్రస్తుతానికి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఈవెంట్లు ఉన్న ప్రతిసారి ఇక్కడికే ప్రాక్టీస్ కోసం వస్తే మా స్టూడెంట్లకు ఇబ్బందవుతుంది. దీంతో పాటు వీఎం హోం భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉండే స్టూడెంట్లు కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ అవసరం ఉంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు గ్రౌండ్ మెయింటెనెన్ చేయాలని సర్కారు ఒక రూల్ తీసుకురావాలి. అంతే కానీ వీఎం హోం గ్రౌండ్‌ను వాడుకోవడం సరికాదు. - రాజు, వీఎం హోం ఓల్డ్ సూడెంట్ల సంఘం వైస్ ప్రెసిడెంట్
గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్నం
నేను దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకుంటున్నా. ప్రాక్టీస్ చేసేందుకు వీఎం హోమ్ గ్రౌండ్‌కు వచ్చా. అక్కడ అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న చెట్ల మధ్య ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రభుత్వం కనీసం ఇలాంటి టైమ్‌లోనైనా గ్రౌండ్ ఫెసిలిటీ కల్పించాలి. - నవీన్, అభ్యర్థి