సమస్యలన్నీ పరిష్కరించుకున్న తర్వాతే షూటింగ్స్ స్టార్ట్

సమస్యలన్నీ పరిష్కరించుకున్న తర్వాతే షూటింగ్స్ స్టార్ట్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి షూటింగ్స్  నిలిపివేయాలని ఫిలిం చాంబర్‌‌ జనరల్‌‌ బాడీ సమావేశంలో నిర్ణయించారు. కొద్ది  రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ గిల్డ్‌‌ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్‌‌ మద్దతు తెలిపింది. టికెట్ ధరల తగ్గింపు, ప్రొడక్షన్ కాస్ట్,  ఓటీటీలో సినిమాల విడుదల, నటీనటుల రెమ్యునరేషన్స్, వర్కర్స్ వేతనాల పెంపు తదితర సమస్యలపై ఆదివారం  సమావేశం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేంత వరకు షూటింగ్​లు బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని  నిర్మాత దిల్​రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ నిర్ణయంతో నిర్మాతలకు నష్టమైనప్పటీకీ,  మారుతున్న విధానాన్ని చర్చించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని షూటింగ్స్ ఆపుతున్నాం. చిన్నా, పెద్ద నిర్మాతలంతా సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  కొవిడ్ తర్వాత ప్రేక్షకుల్లో వచ్చిన మార్పు, ఓటీటీలు రావడం, టికెట్ రేట్లు, షూటింగ్‌‌లో జరుగుతున్న వేస్టేజ్ లాంటి పలు విషయాలపై చర్చించి త్వరలోనే పరిష్కారాలు వచ్చేలా చూస్తాం.  24 క్రాఫ్ట్స్‌‌కు చెందిన వేతనాలు కూడా పెండింగ్‌‌లో ఉన్నాయి. దీనికోసం అన్ని యూనియన్స్‌‌తో మాట్లాడాల్సి ఉంది. సమస్యలన్నీ పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ స్టార్ట్ చేస్తాం’ అని చెప్పారు. 

ఇదిలా ఉంటే  సమావేశం కంటే ముందు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి. గతంలో అధ్యక్షునిగా ఉన్న నారాయణ్‌‌ దాస్‌‌ నారంగ్‌‌ అనారోగ్యంతో ఏప్రిల్ 19న మరణించడంతో, తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా  కొల్లి రామకృష్ణను ఎన్నుకున్నారు. . ఆయన పదవీకాలం కూడా ముగియడంతో నిన్న ఎన్నికలు నిర్వహించారు. కొత్త అధ్యక్షుడిగా బసిరెడ్డి రెండు ఓట్ల తేడాతో కొల్లి రామకృష్ణపై గెలిచారు. 42 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే  ఓ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.  కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.  ఎన్నో రోజులుగా  ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపేందుకే బంద్ నిర్ణయం తీసుకున్నాం.  దీనికోసం ప్రొడ్యూసర్స్ అంతా కలిసి చర్చించుకుంటున్నాం’ అన్నారు.