మళ్లీ అధికారం మాదే..2028లోనూ విపక్షాలు అవిశ్వాసం తీసుకొస్తాయి : ప్రధాని మోదీ

మళ్లీ అధికారం మాదే..2028లోనూ విపక్షాలు అవిశ్వాసం తీసుకొస్తాయి : ప్రధాని మోదీ

పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ్కి ఒక విజన్ అంటూ ఏమీ లేదన్నారు. ప్రజలకు మేలు చేసే బిల్లులు విపక్షాలకు అసలే నచ్చవన్నారు. తమ ప్రభుత్వంపై ఐదేండ్లుగా ప్రిపేర్ అవుతున్నా.. ఫెయిల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయం దేశానికి గొప్ప అవకాశం అన్నారు. గత తొమ్మిదేళ్ల హయంలో 13.5 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పారు. విపక్షాలకు పేదల ఆకలి పట్టదు కానీ.. అధికార ఆకలి మాత్రం ఉందన్నారు. ప్రజల విశ్వాసంతో తాము (ఎన్ డీ ఏ) దేశాన్ని నిర్మిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. 

భారత్ మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించబోతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సమయంలో దేశానికి బలమైన పునాది అవసరమన్నారు. తాము అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. విపక్షాలు చెడు కోరుకుంటే .. తనకు మంచి అవుతుందని చెప్పారు. యువత కలలను సాకారం చేస్తున్నామన్నారు. మంచిగా పని చేస్తే వచ్చే వెయ్యి ఏండ్లకు భరోసా ఇవ్వగలమని చెప్పారు. దేశంలో పేదరికం అంతరించిందని స్వయంగా ఐఎంఎఫ్ చెప్పిందని గుర్తు చేశారు. దేశ ప్రతిష్టతను కొంతమంది దిగజారుస్తున్నారని మండిపడ్డారు. దేశం, ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉందన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2028లోనూ విపక్షాలు తమ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకొస్తాయని చెప్పారు. భారత సైన్యంపై దాడి చేసినోళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. ఇండియా సైన్యంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదన్నారు. విపక్షాలకు పాకిస్తాన్ పైనే నమ్మకం ఎక్కువగా ఉందని చెప్పారు. భారతదేశం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్లపై వాళ్లకు నమ్మకం లేదన్నారు. 2028లో భారత్ టాప్ 3లో ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రసంగానికి అడ్డగింత
పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. సభ్యుల ప్రవర్తన సరికాదని స్పీకర్ పదే పదే హెచ్చరించారు. అయినా వారు వినిపించుకోలేదు. ఈ దశలో ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే.. విపక్ష సభ్యులపై పంచుల వర్షం కురిపిస్తూ.. తమ సభ్యులచే బల్లలు చరిచేలా మాట్లాడారు. మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాల స్లోగన్స్ మధ్యే మోదీ తన స్పీచ్ ను కొనసాగించారు. 

భారతదేశ శత్రువులకు బలమైన సమాధానం చెప్పామన్నారు. మేకిన్ ఇండియా అంటే విపక్షాలు ఎగతాళి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయని అన్నారు. యూపీ, బీహార్, గుజరాత్ లో కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఒడిశాలో 28ఏళ్లుగా కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారని, నాగాలాండ్ లో1988లో చివరిసారి గెలిచిందన్నారు. 1988లో కాంగ్రెస్ కు త్రిపురలో అధికారం దక్కిందని, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాంగ్రెస్ పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయన్నారు. 1962లో చివరిసారి తమిళనాడులో కాంగ్రెస్ నిలిచిందన్నారు. దేశంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ కు దశాబ్దాల సమయం పట్టిందని చెప్పారు.