
న్యూఢిల్లీ: బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. 79వ స్వాతంత్ర దినోత్సం సందర్భంగా శుక్రవారం (ఆగస్ట్ 15) ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ప్రపంచలోనే అతిపెద్ద ఎన్జీవో అని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఈ ఏడాది అక్టోబర్‌లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందని.. ఇది గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాతృభూమి సంక్షేమం కోసం, జాతి నిర్మాణం కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్నారని పొగడ్తలు కురిపించారు.
ఈ క్రమంలో ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ను పొగడటంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 75 ఏండ్లు నిండగానే మోడీని ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేస్తోందని.. దీంతో వారిని మచ్చిక చేసుకుని పీఎం సీటు కాపాడుకోవడానికే రిపబ్లిక్ డే స్పీచ్‌లో మోడీ ఆర్ఎస్ఎస్ భజన చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యక్ష పాత్ర పోషించలేదని, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి సామూహిక నిరసనలకు కూడా ఆ సంస్థ దూరంగానే ఉందని గుర్తు చేశారు.
స్వాతంత్ర పోరాట సమయంలో ఆర్ఎస్ఎస్ దృష్టంతా జాతీయవాదం మీదే ఉందని.. బ్రిటిష్ వారిని ఎదుర్కొవడంపై కాదన్నారు. అనేక సందర్భాల్లో స్వాతంత్ర్య పోరాటాన్ని, భారత రాజ్యాంగ పునాదులను ఆర్‌ఎస్‌ఎస్ బలహీనపరుస్తోందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆ సంస్థ భారతీయులను విభజించి, పక్కనే ఉండిపోయిందన్నారు. ఆర్ఎస్ఎస్ది వలసవాదంపై పోరాటం కాదని.. కేవలం- తోటి భారతీయులలో ద్వేషాన్ని, విభజనను వ్యాప్తి చేయడ మాత్రమేనని విమర్శించారు. ఈ ద్వేషపూరిత భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు దారి తీసిందని హాట్ కామెంట్ చేశారు.