టీఆర్ఎస్​ టికెటివ్వలేదని ఇల్లు కాలబెట్టుకోబోయిండు

టీఆర్ఎస్​ టికెటివ్వలేదని ఇల్లు కాలబెట్టుకోబోయిండు

గోదావరిఖని, వెలుగు: ఎమ్మెల్యే విజయం కోసం పనిచేసిన తనకు కాకుండా మరొకరికి టిక్కెట్​ఇస్తున్నారని రామగుండంలో ఓ వ్యక్తి తన ఇంటికే నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. రామగుండం కార్పొరేషన్​లో గత పాలకవర్గంలో 32వ డివిజన్​కార్పొరేటర్​గా బక్కి రాజకుమారి ఉన్నారు. ఆమెతోపాటు భర్త కిషన్​ టీఆర్ఎస్​లో ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ కు మద్దతిచ్చారు. ప్రస్తుతం కార్పొరేషన్​లోని పలు డివిజన్లను పునర్విభజన చేయగా వీరు నివసించే ప్రాంతం 44వ డివిజన్​గా మారింది. జనరల్​ కేటగిరీ చేశారు. ఈ డివిజన్​నుంచి తనకు టికెట్​కావాలని బక్కి కిషన్​దరఖాస్తు చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం కార్పొరేషన్​లోని 50 డివిజన్లకుగాను 27 మంది అభ్యర్థిత్వాలను ఎమ్మెల్యే ఖరారు చేశారు. ఇంకా 23 మంది పేర్లను ప్రకటించాల్సి ఉంది. అందులో 44వ డివిజన్​ కూడా ఉంది. టీఆర్ఎస్​ నుంచి తనకు కాకుండా మరొకరికి టికెట్​ఇస్తున్నారని తెలుసుకున్న కిషన్​ శనివారం సాయంత్రం పెట్రోల్​ పోసి తన ఇంటిని కాలబెట్టే ప్రయత్నం చేశారు. సీసాలో పెట్రోల్​ తీసుకువచ్చి ఇంట్లో చల్లి అంటించగా కొంతమేర కాలింది. వెంటనే స్థానికులు నీళ్లతో మంటలను ఆర్పేశారు. టీఆర్ఎస్​లో కష్టపడిన వారికి గుర్తింపు లేదని, తనకు టిక్కెట్​ఇస్తానని హామీ ఇచ్చి నేడు దూరం పెట్టడంతో అసంతృప్తికి లోనయ్యాయని కిషన్​ ఆవేదన వ్యక్తం చేశారు.