ఆర్టీసీ పార్సిల్ ఇక ఇంటికే తెచ్చిస్తారు

ఆర్టీసీ పార్సిల్ ఇక ఇంటికే తెచ్చిస్తారు

హైదరాబాద్, వెలుగు: ఇక ఆర్టీసీ కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీసులు ఇంటి దాకా రానున్నాయి. ఇప్పటివరకు కలెక్షన్​ పాయింట్ల వరకే సర్వీస్​ చేసిన సంస్థ.. హోమ్​ డెలివరీ చేసేందుకు మూడు సంస్థలతో డీల్​ కుదుర్చుకుంది. దీంతో ఆర్టీసీ అందిస్తున్న మూడు రకాల సర్వీసులు జనానికి మరింత చేరువ కానున్నాయి.   హోమ్​ డెలివరీ సర్వీస్​ను 11న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించే అవకాశముంది. మరో వైపు రెగ్యులర్​ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరగడంతో ఆర్టీసీ ఇన్​కమ్​ పెరుగుతోంది.

కార్గోకు మంచి రెస్పాన్స్​.. అందుకే విస్తరణ

ఈ ఏడాది మొదట్లో కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఏజెంట్స్​ను పెట్టుకుని బిజినెస్​ పెంచుకుంటోంది. ప్రతి బస్టాండ్లలో కలెక్షన్ పాయింట్లు పెట్టి సేవల్ని విస్తరించింది. అయితే ఇప్పటిదాకా ఏదైనా పార్సిల్ బస్టాండ్లలో కలెక్షన్ పాయింట్ వరకే వచ్చేది.  ఇకపై ఆ అవసరం లేకుండా పార్సిల్​ నేరుగా ఇంటికే రానుంది. అయితే హోమ్​ డెలివరీకి కొంత చార్జీని అదనంగా వసూలు చేస్తారు.   ఏపీలో ఇలాగే చేస్తున్నారు.

ఆక్యుపెన్సీ పెరుగుతోంది.. గాడిన పడుతోంది

కరోనా టైమ్​లో  ఆర్టీసీ బాగా దెబ్బతిన్నది.రూ.రెండు వేల కోట్ల దాకా నష్టం వచ్చింది.  అన్ లాక్ తర్వాత కూడా వైరస్ భయంతో జనం పెద్దగా బస్సులెక్కలేదు. దీంతో  సగం బస్సులనే తిప్పారు. మూడు నెలల వరకు రోజుకు రెండు మూడు కోట్ల కలెక్షన్ దాటలేదు. ఇప్పుడిప్పుడే   ప్రయాణికుల రద్దీ  పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 65 శాతం వరకు నమోదువుతోంది. అన్ లాక్ ప్రారంభంలో ఓఆర్​ 30 శాతం  కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8,100  బస్సులను నడుపుతున్నారు. ఇందులో  హైదరాబాద్ లో 2000 బస్సుల వరకు ఉండగా, మిగతావి జిల్లాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం   రూ.9 కోట్ల వరకు కలెక్షన్ వస్తోంది. కరోనా కంటే ముందు ప్రతిరోజు రూ.12 కోట్ల వరకు కలెక్షన్ వచ్చేది. సిటీలో మాత్రం రూ.2 కోట్లకు పైగా వస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఆర్టీసీ  గాడిన పడే అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు.

రోజుకు 12 నుంచి 13 లక్షల ఆదాయం

తక్కువ చార్జీతో సర్వీస్,  డెలివరీలో డిలే లేకపోవడం, విస్తృతమైన నెట్​వర్క్​ ఉండడంతో కొరియర్ సర్వీస్​లో ఆర్టీసీ దూసుకెళ్తోంది. కొత్త ఆర్డర్లు బాగా పెరుగుతున్నాయి. రోజుకు 12 నుంచి 13 లక్షల ఆదాయం వస్తోంది. ఇక ఏపీతో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కుదరడంతో అక్కడి ఆర్డర్స్ కూడా కన్ఫామ్ అవుతున్నాయని, త్వరలో సేవలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. హోం డెలివరీ, ఏపీ  సర్వీసులతో ఆదాయం మరింత పెరగనుంది.