కొండా ఆస్తులు రూ.4వేల 568 కోట్లు... దేశంలోనే టాప్ 5లో ఉండొచ్చు

కొండా ఆస్తులు రూ.4వేల 568 కోట్లు... దేశంలోనే టాప్ 5లో ఉండొచ్చు
  •     భార్య, కొడుకు పేరుపైన భారీగా స్థిర, చరాస్తులు
  •     అఫిడవిట్​లో వెల్లడించిన చేవెళ్ల బీజేపీ అభ్యర్థి 
  •     పీయూష్​ గోయల్​ సమక్షంలో విశ్వేశ్వర్​ రెడ్డి నామినేషన్​ 

హైదరాబాద్/గండిపేట్, వెలుగు: చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్‌‌లో భారీగా ఆస్తులు చూపించారు. విశ్వేశ్వర్‌‌రెడ్డి, ఆయన భార్య, కొడుకుకు కలిపి మొత్తం రూ.4,488 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌‌లో పేర్కొన్నారు. వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తుల విలువ రూ. 4,568.21 కోట్లు. ఈ ఆస్తులతో విశ్వేశ్వర్​రెడ్డి దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో టాప్​ 5 లో   నిలిచే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. విశ్వేశ్వర్‌‌రెడ్డికి రూ.1,178.72 కోట్ల చరాస్తులు ఉండగా, ఆయన భార్య సంగీతారెడ్డికి  రూ.3,203 కోట్లు, కొడుకు విరాజ్‌‌ మాధవ్​కు రూ.107.44 కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్​​లో చూపారు.

  విశ్వేశ్వర్‌‌రెడ్డి పేరు మీద స్థిరాస్తులు రూ.71.34  కోట్లు, భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3.6 కోట్లు,  కొడుకు విరాజ్‌‌ మాధవ్‌‌ కు రూ.1.27 కోట్లు ఉన్నట్టు  వెల్లడించారు.  విశ్వేశ్వర్‌‌రెడ్డికి అప్పులు  రూ.1.76  కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక  భార్య సంగీతారెడ్డి అప్పులు రూ.12 కోట్లుగా చూపించారు.  విశ్వేశ్వర్‌‌రెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్స్‌‌ గ్రూపునకు సంబంధించిన షేర్లే ఉన్నాయి. విశ్వేశ్వర్‌‌రెడ్డికి అపోలోలో రూ.973 కోట్లు, ఆయన భార్యకు రూ.1500 కోట్ల విలువైన షేర్లున్నాయి.  భూముల విషయానికి వస్తే.. విశ్వేశ్వర్‌‌రెడ్డికి హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల మొత్తం 70 ఎకరాలు, ఆయన భార్యకు 14 ఎకరాల భూమి ఉంది. ఇవి కాకుండా 45,432 స్క్వేర్‌‌ ఫీట్ల విస్తీర్ణం గల నివాస భవనాలున్నాయి. ఇక వాణిజ్య భవనాల విషయానికి వస్తే బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ఒకటి, ఉస్మాన్‌‌గంజ్‌‌లో 14 షాపులు, జూబ్లీహిల్స్‌‌ రోడ్డు నెంబర్‌‌ 86లో ఒక షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌ ఉన్నాయి. అయితే, 2019లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వారికి రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. 2014లో బీఆర్​ఎస్​ టికెట్‌‌పై చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించగా.. అప్పుడు ఆస్తులు రూ.528 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు.

నామినేషన్​కు కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​

చేవెళ్ల లోక్​సభస్థానానికి  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  రాజేంద్రనగర్​లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్​ దాఖలు చేశారు. కేంద్రమంత్రి  పీయూష్ గోయల్, ఎంపీ లక్ష్మణ్ ఆయన వెంట వచ్చారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్​ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురులేదన్నారు. ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయని చెప్పారు. ఆ కూటమిలోని పార్టీలకు ఒకరంటే మరొకరికి పడదని  ఎద్దేవా చేశారు.  

చేవెళ్ల గడ్డపై విజయం సాధిస్తా: విశ్వేశ్వర్ ​రెడ్డి

చేవెళ్ల నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో గెలువబోతున్నానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం అహర్నిశలు పని చేస్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు చేవెళ్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని  చెప్పారు. తాను ఎంపీగా విజయం సాధించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను తీసుకొచ్చి చేవెళ్లను అభివృద్ధి చేస్తానని తెలిపారు.