టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారా..?

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారా..?
  • అభివృద్ధిపై చర్చించకపోతే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందని భావించాల్సి ఉంటుంది
  • కొంత మంది వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడుతున్నారు
  • బీజేపీ నేతలకు తెలంగాణ అభివృద్ధి చూసే అవకాశం కలుగుతోంది
  • మా పథకాలను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయి
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్


హైదరాబాద్: కొందరు వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడి వెళ్లిపోతున్నారని.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వరదలా చేరికలు ఉంటాయని.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ అభివృద్ధిని చూసే సదవకాశం కలుగుతోందన్నారు. మా పథకాలను ఇప్పటికే కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. మా పథకాలు మరిన్ని అమలు చేసే విషయం.. తెలంగాణ కు రావాల్సిన ప్రయోజనాలను బీజేపీ సమావేశాల్లో చర్చించాలని దానం నాగేందర్ సూచించారు. 
బండి సంజయ్ కొత్త బిచ్చగాడిలా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వరద బాధితులకు 25 వేలు ఇస్తా అన్నాడు.. కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా తెచ్చాడా ? అని దానం నాగేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో 30 ఫ్లై ఓవర్లు కట్టాము.. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాము.. ఇందులో కేంద్రం వాటా ఒక్క పైసా అయినా ఉందా..? 5 వ తేదీ తర్వాత మేము వాస్తవాలు చెబుతామని ఎమ్మెల్యే నాగేందర్ చెప్పారు. ప్రభుత్వాలను కూల్చడమే తప్ప బీజేపీ కి వేరే పని లేదని ఆయన ఆరోపించారు. మోడీని చూసి కేసీఆర్ భయపడితే తెలంగాణ తెచ్చేవారా ? మేము చెప్పింది చేస్తాం అన్నారు. బీజేపీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యాయని.. ఆ పార్టీ కి గుణ పాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తున్నట్లు భావించాలా?

తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించకపోతే బీజేపీకి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందని భావించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కామ్ చళ్తా రహేగా.. మోడీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే కుదరదు.. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నేతలను నిలదీసే పరిస్థితి వస్తుందని దానం నాగేందర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉందని.. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారు

కేంద్రం కారు చౌకగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆరోపించారు. కేసీఆర్ ను తిట్టడం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదన్నారు. తెలంగాణలో తిరుగుతున్న బీజేపీ జాతీయ నేతలకు ఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి అభివృద్ధి ఉందా ? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు హైదరాబాద్ పైకి మిడతల దండులా దాడికి వస్తున్నారని ఆరోపించారు.