ఆపరేషన్‌ అజయ్‌ : ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న212 మంది

ఆపరేషన్‌ అజయ్‌ : ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న212 మంది

ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అక్కడ ఉన్న భారత పౌరుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు పట్టింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ఆపరేషన్‌ అజయ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 200 మందికి పైగా భారతీయులను తీసుకుని టెల్‌ అవీవ్‌ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం (అక్టోబర్ 13న) తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి వచ్చిన భారత పౌరులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా హత్తుకున్నారు. తొలి బ్యాచ్‌లో మొత్తం 212 మంది భారతీయులను వెనక్కి వచ్చారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌’ ఆధారంగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యుద్ధం సమయంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. 

ఇజ్రాయెల్ లో నార్మల్ పరిస్థితులు లేవని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని భారతకు వచ్చిన వాళ్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ అధికారులు తమను సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లమన్నారని చెప్పారు. తాము బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయని, ఆ సైరన్ల మోత ఇంకా తమ చెవుల్లో మార్మోగుతూనే ఉందన్నారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.