కడెంకు 64 ఏండ్లలో అత్యధిక వరద

కడెంకు 64 ఏండ్లలో అత్యధిక వరద
  • 1958లో 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • 1976 తర్వాత గోదావరికి జూన్‌, జులైలో ఇదే భారీ వరద
  • మరికొన్ని రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ప్రవాహాలు

హైదరాబాద్‌, వెలుగు: కడెం ప్రాజెక్టు చరిత్రలోనే మంగళవారం భారీ వరద పోటెత్తింది. 1958 తర్వాత ఈ ప్రాజెక్టుకు ఇంత స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. నిజాం ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టు పనులు 1916లో షురూ అయ్యాయి. భారీ వరదలు వచ్చి కట్ట కొట్టుకుపోవడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. నిజాం హయాంలోనే 1948లో తిరిగి ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలు పెట్టి 1956లో పూర్తి చేశారు. 1958 ఆగస్టు 31న ఈ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా అప్పట్లోనే 9 జపాన్‌ గేట్లను ఈ ప్రాజెక్టుకు బిగించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వస్తాయని అప్పట్లోనే అంచనావేసి, మరో 9 ఇండియన్‌ గేట్లను ఏర్పాటు చేసి 3 లక్షల క్యూసెక్కుల వరద గేట్ల ద్వారా పోయేలా పనులు చేశారు. 1995, 2018లోనూ కడెంకు భారీగా వరద వచ్చింది. 2018లో వరద ఉధృతికి ఒక గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీళ్లన్నీ వృథాగా పోయాయి. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌, బజార్‌ హత్నూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ, ఉట్నూర్‌ మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సోమవారం అర్ధరాత్రి నుంచి కడెం ప్రాజెక్టుకు క్రమేణా వరద పెరిగింది. మంగళవారం ఉదయానికి 5.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులు కాగా ఒకానొక దశలో 705 అడుగులకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు కట్ట 709 అడుగుల వరకు నిర్మించారు. దీన్ని టాప్‌ ఆఫ్‌ ద బండ్‌ లెవెల్‌గా పేర్కొంటారు. 7.60 టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సిన ప్రాజెక్టులో నిల్వ 8.90 టీఎంసీలకు చేరింది.

1986లో మహోగ్ర గోదావరి
గోదావరి నది 1986 ఆగస్టు 16న ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు కాగా, ఆరోజు 75.6 అడుగుల లెవెల్ లో గోదావరి ఉప్పొంగింది. ఆ రోజు 35.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వచ్చింది. గోదావరి, ప్రాణహిత సహా మిగతా ఉప నదుల్లోనూ ఆరోజు భారీ వరద వచ్చింది. 1976 జూన్‌ 22న భద్రాచలం వద్ద 63.9 అడుగుల లెవెల్​లో గోదావరి ప్రవహించింది. 2013 ఆగస్టు 3న 61.1 అడుగుల స్థాయిలో గోదారమ్మ ఉరకలెత్తింది. నదీ చరిత్రలో ఇవే అత్యధిక ప్రవాహాలుగా ఇరిగేషన్‌ రికార్డుల ఆధా రంగా నిర్ధారించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1983 ఆగస్టు 11న అత్యధికంగా 8 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. సింగూరుకు 1998 అక్టోబర్‌ 19వ తేదీన 2,96,500 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 2000 ఆగస్టు 25న 1,49,650 క్యూసెక్కుల వరద వచ్చింది.