రెండ్రోజుల్లో .. రాష్ట్రమంతటా వానలు

రెండ్రోజుల్లో .. రాష్ట్రమంతటా వానలు

మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించాయని,  ఆది, సోమవారాల్లో  అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.  గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా నెల్లికల్​లో అధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఖమ్మం జిల్లాలోకి రుతుపవనాలు ఎంటరయ్యాయన్న వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన టెంపరేచర్లు 

హైదరాబాద్, వెలుగు: మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ గురువారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించాయని వెల్లడించింది. వచ్చే ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.  గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా నెల్లికల్​లో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 6.5, చుక్కాపూర్​లో 5.7, ఆమనగల్​లో 4.8, నల్గొండ జిల్లా మేడ్లవాయిలో 4.6, యాదాద్రిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కరీంనగర్, మేడ్చల్, గద్వాల, నాగర్​కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, నారాయణపేట, సిరిసిల్ల, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. 

ఎండలు తగ్గినా.. ఉక్కపోత 

రాష్ట్రంలో ఎండలు తగ్గిపోయాయి. గురువారం నాలుగైదు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదయ్యాయి. జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్​ జిల్లాల్లో ఒక్కోచోట, నిజామాబాద్​ జిల్లాలో  40 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 41.7 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. నిర్మల్​ జిల్లా మామ్దాలో 40.7, ఆదిలాబాద్​ జిల్లా పిప్పల్​ధారిలో 40.5, నిజామాబాద్​ జిల్లా ముప్కాల్​లో 40.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్​లో 37.1 డిగ్రీలు రికార్డయింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టులో అత్యధికంగా 100 శాతం హ్యుమిడిటీ నమోదైంది.