పెయిడ్​ కార్యకర్తలు

పెయిడ్​ కార్యకర్తలు
  • ఫిక్స్‌‌డ్‌‌ శాలరీలు ఆఫర్ చేస్తున్న లీడర్లు
  • ఎన్నికలయ్యేదాకా తమ వెంటే ఉండేలా అగ్రిమెంట్
  • సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండేవారికి ప్రయారిటీ
  • డబ్బుల పంపిణీ సహా అన్ని పనులు చేసేందుకు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు : గతంలో ఎమ్మెల్యే కావాల్నంటే ప్రజాబలం, పార్టీ అండ అవసరం. ఇప్పుడు అలా కాదు.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారం బహిరంగ సభలు, సమావేశాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా బలగమే ఓటర్లను ఆకర్షిస్తోంది. జనాలను ఎవరు ఇన్‌‌ఫ్లుయెన్స్ చేస్తే వాళ్లదే గెలుపు అనే పరిస్థితి వచ్చేసింది. తమను నిలబెట్టేందుకైనా, అవతలి పార్టీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారాలకైనా తమకంటూ సోషల్ సైన్యాన్ని నియమించుకోవడం నాయకులకు తప్పనిసరిగా మారింది. దీంతో ఇప్పటికే లీడర్లు తమ తరఫున సర్వేలు చేసేందుకు, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేసేందుకు మనుషులను నియమించుకున్నారు. 

అయితే, అక్కడితోనే ఆగితే ఎన్నికల్లో గెల్వడం కష్టమేనన్న అభిప్రాయాన్ని లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. అభిమానంతో తమ వెంట నడిచే కార్యకర్తలే గెలిపిం చలేరని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో పనిచేసే ‘పె యిడ్ కార్యకర్తలను’ నియమించుకుంటున్నారు. త మ నియోజకవర్గం నుంచి కొందరిని, వేరే ఏరియాలోని మరికొంత మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

జీతం ఎక్కువే

పెయిడ్ కార్యకర్తలకు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఆఫర్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే దాకా తమతోనే ఉండేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండే వారికి, యువతకు ఈ ఉద్యోగాల్లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పోస్టింగ్స్ ఎలా పెట్టాలో, కౌంటర్లు ఎలా ఇవ్వాలో వీరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఎన్నికల తర్వాత సభలు, సమావేశాల్లో పాల్గొనడం, డబ్బులు తరలించడం, పంపిణీ చేయడం వంటి వ్యవహారాలు కూడా వీరి విధుల్లో భాగంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ లీడర్ ఇప్పటికే 30 మందిని నియమించుకుని, వారికి ట్రైనింగ్ ఇప్పించే పనిలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీకి సిద్ధమవుతున్న ఓ వ్యక్తి తన తరఫున పనిచేసేందుకు మనుషులను సప్లై చేయడానికి ఓ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇలా పెయిడ్ కార్యకర్తలను నియమించుకుంటున్న వారిలో ఎక్కువగా యువ నాయకులు, బిజినెస్‌‌లో సక్సెస్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉండడం గమనార్హం.

సప్లై సంస్థలు

ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టు పెయిడ్ కార్యకర్తలను సప్లై చేసే సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. సర్వే సంస్థలుగా ప్రచారం చేసుకుంటూ అన్ని రకాల పనులు చేసే టాలెంటెడ్ వ్యక్తులను ఈ సంస్థలు లీడర్లకు అప్పగిస్తున్నాయి. కంటెంట్ రైటర్లు, ఫొటోగ్రాఫర్లు, డిజైనర్లు, సర్వేయర్లు, డేటా అనలిస్టులు, అడ్వైజర్లు సహా నాయకుల సూచనలు, అవసరాలకు తగ్గట్టుగా మ్యాన్‌‌ పవర్‌‌‌‌ను అందిస్తున్నాయి. ఇందుకోసం లక్షల్లో చార్జ్‌‌ చేస్తున్నా, చెల్లించేందుకు నాయకులు వెనుకాడడం లేదు. నాయకులు కూడా తాము నియమించుకున్న సంస్థల ప్రతినిధులు ఎట్లా చెప్తే, అట్లాగే చేసేందుకు సిద్ధమవుతున్నారు. డ్రెస్సింగ్ నుంచి ప్రెస్‌‌మీట్లలో ఏం మాట్లాడాలో, ఏ అంశంపై ఎలాంటి కామెంట్లు చేయాల్నో కూడా సర్వే సంస్థలే నాయకులకు దిశానిర్దేశం చేస్తుండడం గమనార్హం.