పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం

పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం

కుత్బుల్లాపూర్: పీఎఫ్‌ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఆదివారం సూరారం అమీద్ బస్తీలోని ఓ మదర్సాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్పార్పియో, ఇతర వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. తెల్లవారు జామున  5 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వహీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. 

కాగా... నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ ముసుగులో పలువురికి సంఘ విద్రోహ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్​ఐఏకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  సోదాలు నిర్వహిస్తోంది.