‘సంగమేశ్వరం’పై జాయింట్ కమిటీ రిపోర్టులో.. అన్నీ తప్పులే!

‘సంగమేశ్వరం’పై జాయింట్ కమిటీ రిపోర్టులో.. అన్నీ తప్పులే!

ఎన్జీటీలో అభ్యంతరాలను ఫైల్ చేసిన తెలంగాణ సర్కారు

కమిటీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు

శ్రీశైలం నుంచి రాయలసీమకు కేటాయింపులే లేవు

కృష్ణా బోర్డు, ఐఐటీ ప్రొఫెసర్ ఆబ్జెక్షన్స్ ను పట్టించుకోలేదు

ఈ లిఫ్ట్ పూర్తిగా కొత్త ప్రాజెక్టే..

ప్రాజెక్టుకు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తప్పనిసరని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు చేపట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంకు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరం లేదంటూ జాయింట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు తప్పులతడక అని తెలంగాణ సర్కారు నేషనల్​ గ్రీన్ ట్రిబ్యునల్​కు స్పష్టం చేసింది. కమిటీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొంది. శుక్రవారం (ఈనెల 28న) తుది విచారణ జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఆబ్జెక్షన్లను ఎన్జీటీకి పంపింది. రాయలసీమ లిఫ్ట్ పూర్తిగా కొత్త ప్రాజెక్టు అని, మూడు వన్యప్రాణి విభాగాలపై దాని ఎఫెక్ట్​ పడుతోందని స్పష్టం చేసింది. దీనికి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తప్పనిసరని తేల్చిచెప్పింది.

అసలు కేటాయింపులే లేకుండా..

తెలుగుగంగ, గాలేరు నగరి, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కు నీటిని సప్లిమెంట్ చేసేందుకే కొత్త లిఫ్ట్ చేపడుతున్నా మని ఏపీ చెప్తే.. జాయింట్ కమిటీ గుడ్డిగా ఓకే చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు 111 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఆ నీటిని మాత్రమే కొత్త లిఫ్ట్ ద్వారా తీసుకుంటామని, పాత ప్రాజెక్టులకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్నందున కొత్తగా అవసరం లేదంటూ ఏపీ సాకు చెప్పిందని స్పష్టం చేశారు. అసలు బచావత్అ వార్డులో శ్రీశైలం నుంచి రాయలసీమకు కేటాయింపులే లేవని తేల్చి చెప్పారు.

నీళ్లన్నీ తోడేసుకునేలా..

కొత్త లిఫ్ట్ ద్వారా ఏపీ రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని, 1977లో చేసుకున్న ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం శ్రీశైలం నుంచి 1,500 క్యూసెక్కులకు మించి నీటిని తరలించవద్దని అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం కుడి కాల్వ నుంచి ఇంకో 750 క్యూ సెక్కులు తీసుకునేందుకు కేడబ్ల్యూ డీటీ –2 అవకాశం కల్పించిందని.. మొత్తంగా 2,250 క్యూ సెక్కులనే తీసుకోవడానికి ఏపీకి చాన్స్​ఉందని వివరించారు. ఈ నీళ్లను కూడా రిజర్వాయర్ లో 854 అడుగుల మట్టం ఉన్నప్పుడే తీసుకోవాలని.. కానీ అందుకు విరుద్ధంగా 797 అడుగుల నుంచే నీళ్లన్నీ తోడుకునేలా ఏపీ కొత్త లిఫ్ట్ ను ప్రతిపాదించిందని తెలిపారు.

          1,500 క్యూసెక్కులే తీసుకునేందుకు పర్మిషన్ ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు 11,150 క్యూ సెక్కులు తీసుకునేలా తూములు ఏర్పాటు చేశారని.. తర్వాత 44 వేల క్యూసెక్కులకు పెంచారని.. ఇప్పుడు ఏకంగా 80 వేల క్యూసెక్కులకు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు.

           1976, 77లో చేసుకున్న ఒప్పందాల మేరకు శ్రీశైలం నుంచి ఏపీ ప్రాంతానికి 34 టీఎంసీలే తీసుకోవాల్సి ఉందని.. కానీ రెండేళ్లుగా 115.4 టీఎంసీలు, 179.30 టీఎంసీలను ఏపీ తీసుకుందని వెల్లడించారు. ఏపీ సర్కారు ఈ ఏడాది మే 5న కొత్త ప్రాజెక్టులకు ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో కాల్వల ఎక్స్ పాన్షన్ పనులు ఉన్నాయని, వాటికి 2006 ఈఏసీ నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్ మెంట్​పర్మిషన్లు తప్పనిసరని తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలపైనా ఎఫెక్ట్

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు కాల్వ విస్తరణ పనులను రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కోర్ జోన్ నుంచే చేపట్టాల్సి ఉంటుందని అధికారులు ఎన్జీటీకి తెలిపారు. వెలుగోడు రిజర్వాయర్ కెపాసిటీ పెంపుతో రాజీవ్ గాంధీ శాంక్చువరీ ముంపునకు గురవుతుందని, టైగర్ రిజర్వ్ పై ప్రభావం పడుతుందని వివరించారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల కెపాసిటీ పెంపుతో నర్సింహస్వామి శాంక్చువరీపైనా ప్రభావం ఉంటుందన్నారు. ఈ లెక్కన ప్రాజెక్టుకు ఎన్వి రాన్ మెంట్ క్లియరెన్స్ తప్పనిసరని తెలిపారు. జాయింట్ కమిటీ వీటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం ఏపీ ఇచ్చిన సమాచారంతో ఎన్వి రాన్ మెంట్ క్లియరెన్స్ అవసరం లేదంటూ తప్పు డు నివేదిక ఇచ్చిందని స్పష్టం చేశారు. కమిటీ నివేదికను పక్కనపెట్టి .. కొత్తగా నివేదిక కోసం ఆదేశించాలని, పర్యావరణ క్లియరెన్స్ ఉంటే తప్ప ప్రాజెక్టు చేపట్టకుండా ఏపీని ఆదేశించాలని కోరారు.

ఏపీ తప్పుదోవ పట్టించింది

జాయింట్​ కమిటీ జులై 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టు వివరాలను తెలుసుకుందని, ఆ సమయంలో కమిటీని ఏపీ సర్కారు తప్పుదోవ పట్టించిందని తెలంగాణ అధికారులు ఆబ్జెక్షన్స్​లో స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 256.03 మీటర్ల నుంచే నీటిని తీసుకునేలా కడ్తున్నా.. 261.20 మీటర్ల నుంచే డ్రా చేయగలమని ఏపీ చెప్పిందని వివరించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తిగా కొత్త ప్రాజెక్టు అని, అది పూర్తయి తే ఇప్పటికే నిర్మించిన మిగతా ప్రాజెక్టులపై తీవ్రంగా ఎఫెక్ట్​ పడుతుందని కృష్ణా బోర్డు మెంబర్​ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

రేపు తుది విచారణ, తీర్పు

సంగమేశ్వరం లిఫ్ట్, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులకు ఎన్విరాన్ మెంట్​ క్లియరెన్స్ తీసుకునేలా ఆదేశించాలంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు ఎన్వి రాన్ మెంట్​ క్లియరెన్స్ అవసరమో లేదో స్టడీ చేసి చెప్పాలంటూ ఎన్జీటీ జా యింట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ క్లియరెన్స్​ అవసరం లేదంటూ రిపోర్టు ఇచ్చింది. దీనిపై పిటిషనర్ తో పాటు తెలంగాణ సర్కారు ఆబ్జెక్షన్స్​ చెప్పింది. శుక్రవారం ఎన్జీటీ తుది విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది.