సుస్థిర పాలనతోనే దేశానికి పెట్టుబడులు...రాజకీయ స్థిరత్వంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ

సుస్థిర పాలనతోనే  దేశానికి పెట్టుబడులు...రాజకీయ స్థిరత్వంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
  •     ‘బడ్జెట్ 2026’.. వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌కు ప్రేరణ
  •     మా బడ్జెట్లు ఖాతా పుస్తకాలు కావు..  భవిష్యత్తుకు సన్నద్ధత  
  •     వాణిజ్య ఒప్పందాలు దేశ బలం..రక్షణ రంగంలో రాజీపడం
  •     ప్రపంచానికి భారత్‌‌‌‌‘డేటా హబ్’గా మారబోతున్నదని కామెంట్ 

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌ కేవలం అభివృద్ధి పథంలో పయనించడం లేదని, ‘వికసిత భారత్’గా అవతరించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజకీయ సుస్థిరత, స్పష్టమైన విధాన నిర్ణయాలే నేడు భారత్‌‌‌‌ను ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయని తెలిపారు.  ఆదివారం ప్రధాని మోదీ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  దేశ ఆర్థిక, రక్షణ, డిజిటల్ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ఈ ఏడాది బడ్జెట్ ఏదో మొక్కుబడిగా చేసిన ‘బహీ -ఖాతా’ (లెక్కల పత్రం) కాదని, ఇది 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం అని పేర్కొన్నారు.  

గతంలోలాగా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం కాదని, ఇది దేనికైనా ‘మేం సిద్ధం’ అంటూ మన సన్నద్ధతను చాటిచెప్పే క్షణమని తెలిపారు. 1920లలో తీసుకున్న నిర్ణయాలు 1947లో స్వాతంత్ర్యానికి ఎలా పునాది వేశాయో.. ఇప్పుడు తాము తీసుకుంటున్న నిర్ణయాలు 2047 నాటి ‘వికసిత్ భారత్’కు గట్టి పునాది వేస్తున్నాయి అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ సుస్థిరత, సుస్థిర విధాన నిర్ణయాలు  అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయని చెప్పారు. వివిధ దేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు మన దేశ బలాన్ని చాటి చెప్తున్నాయని అన్నారు. 

మన తయారీ రంగం, సేవా రంగం, ఎంఎస్‌‌‌‌ఎంఈలు బలోపేతం కావడం వల్లనే ప్రపంచ దేశాలతో భారత్ సమాన స్థాయిలో చర్చలు జరుపుతున్నదన్నారు.  38 దేశాలతో కుదుర్చుకున్న  ఫ్రీ ట్రేడ్‌‌‌‌ అగ్రిమెంట్లు దేశ ఎంఎస్‌‌‌‌ఎంఈ  రంగానికి (టెక్స్‌‌‌‌టైల్స్, లెదర్, హ్యాండీక్రాఫ్ట్స్) అంతర్జాతీయ మార్కెట్లను చేరువ చేస్తాయని తెలిపారు.

యూపీఏ హయాంలో ఎకానమీ అస్తవ్యస్తం

యూపీఏ హయాంలోని ఎకానమీ అస్తవ్యస్తం వల్ల ప్రపంచ దేశాలతో భారత్ ఆత్మవిశ్వాసంతో చర్చలు జరపలేకపోయేదని, అప్పట్లో చర్చలు మధ్యలోనే ఆగిపోయేవి తప్ప ఫలితం ఉండేది కాదని ప్రధాని మోదీ తెలిపారు.  కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను అంకితభావంతో అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.  ఫలితంగా శక్తివంతమైన స్థానంలో ఉండి నేడు చర్చలు జరుపుతున్నామన్నారు. 

అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ నేడు ఆర్థిక వృద్ధిలో ఒక వెలుగుతున్న తారలా ఉన్నదని చెప్పారు. ఆర్థిక పరివర్తనలో ప్రైవేట్ రంగం మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టుగా దేశ సైన్యాన్ని ఆధునీకరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

‘‘114 రాఫెల్ జెట్ల దిగుమతి ఒక ఎత్తయితే, దేశీయంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం మరో ఎత్తు. మన సైనికుల సంక్షేమం, దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.  భారత్ నేడు ప్రపంచ డిజిటల్ లీడర్‌‌‌‌గా ఎదిగిందని తెలిపారు. ప్రజల నగదు లావాదేవీల శైలినే మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూపీఐ) దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్‌‌‌‌ డేటా హబ్‌‌‌‌గా మారుతున్నదని తెలిపారు. తద్వారా మన యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని  ఆశాభావం వ్యక్తం చేశారు.

 మహిళా శక్తితోనే వికసిత్‌‌‌‌ భారత్

 మహిళల సంక్షేమమే తమ ప్రతి నిర్ణయానికి దిక్సూచి అని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్‌‌‌‌ భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారి అభివృద్ధిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు.  వచ్చే పదేండ్లలో భారత్ మరింత వేగంగా వృద్ధి చెందడానికి మూడు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు  తెలిపారు.  

మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు, లోతైన ఆవిష్కరణలు, సరళమైన పాలన తమ ప్రధాన లక్ష్యాలు అని వెల్లడించారు. ‘‘కొవిడ్‌‌‌‌ మహమ్మారి అనంతర ప్రపంచం భారత్ ముందు కొత్త తలుపులు తెరిచింది. మౌలిక సదుపాయాల కల్పనలో మనం రికార్డులు సృష్టిస్తున్నాం. ప్రైవేట్ రంగం కూడా ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టి ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి” అని మోదీ పిలుపునిచ్చారు.