ఈ ఆదివాసి గ్రామంలో వంతులవారీగా కాపరి పని

ఈ ఆదివాసి గ్రామంలో వంతులవారీగా కాపరి పని

ఎవరెట్ల పోతే మనకేంది? ముందు మన బతుకు చక్కబెట్టుకుందాం అనుకోలేదు ఆ ఆదివాసులు. కష్టమో, సుఖమో కలిసి నడవాలనుకున్నారు. ఉన్నోడు, లేనోడు అని లేకుండా అందరూ ఒక మాట మీదకి వచ్చారు. దాంతో వాళ్ల సమస్యే బెదిరిపోయి, పారిపోయింది. వాళ్లకు జీవనాధారమైన పశువులు వాళ్లకి దక్కాయి. కలిసుంటే ఏ కష్టం దరిచేరదని మరోసారి రుజువు చేసిన ఈ ఆదివాసుల ఊరు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రాగాపూర్. 

సిర్పూర్ యు మండలంలో ఉంది రాగాపూర్. ఈ ఆదివాసి గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రతి ఇంట్లోనూ ఆవులు, బర్రెలు, మేకలు ఉంటాయి. అయితే, ఇంతకుముందు రోజుల్లో వాటిని మేపడానికి ఒక్కోదానికి నెలకి వంద, యాభై రూపాయలు తీసుకునేవాళ్లు కాపర్లు. కానీ, రానురాను అన్నింటితో పాటు వాళ్ల జీతం కూడా బాగా పెరిగింది. ఒక్కో పశువుకి నెలకి మూడొందల రూపాయలు అడుగుతున్నారు వాళ్లు. కాపరికి అంత జీతం ఇవ్వలేక చాలామంది ఆదివాసులు ఆవులు అమ్మేశారు. దాంతో ఏటికేడు ఊళ్లోని ఆవుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ ప్రభావం వ్యవసాయం పైనా పడింది. దాంతో ఆదివాసులంతా పటేల్ ఇంటికెళ్లారు. జీతం గిట్టుబాటు కాక కాపర్లు పశువులు మేపడానికి  రావట్లేదని చెప్పారు. దాంతో అందరూ కలిసి బాగా ఆలోచించి..  కాపరితో పనిలేకుండా ఊళ్లోని పశువులన్నింటినీ  వంతులు వారీగా తామే మేపాలని నిర్ణయించుకున్నారు. అలా ఒక్కొక్కరికీ  నెలలో మూడుసార్లు  వంతు వస్తుంది. మిగిలిన వాళ్లు ఆ టైంలో పూర్తిగా వ్యవసాయంపైనే దృష్టిపెడుతున్నారు.  పంటలు బాగా చేతికొస్తున్నాయి. ఈ ఆలోచన వల్ల ఊళ్లోని మిగతావాళ్లు కూడా ధైర్యంగా పశువులను కొంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ ఊళ్లోని పశువుల సంఖ్య  పెరిగింది.  

అమ్ముకునే పరిస్థితి రావద్దని..

కాపర్లకు జీతం ఇవ్వలేక ఊళ్లోని చాలామంది ఆవులు అమ్ముకున్నారు. ముందుముందు అలాంటి పరిస్థితి రావద్దనే వంతుల వారీగా ఆవులను మేపాలన్న నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇకముందు ఎవరూ ఆవులను అమ్మకూడదని అనుకున్నాం. అందరూ ఈ మాటకి కట్టుబడి ఉన్నారు. 

-ఆత్రం రామ్ షావ్ , రైతు