
లండన్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. ఇండియా సహకార పొరుగు దేశంగా ఉండటానికి బదులుగా పోరాట ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇకనైనా కాశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి ఇండియా ప్రయత్నాలు చేయాలని నీతులు వల్లించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ఆదివారం (సెప్టెంబర్ 21) లండన్‌లోని పాకిస్తానీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వివాదస్పద కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
కాశ్మీర్ సమస్యను గాజా యుద్ధంతో పోల్చారు. ఇండియా, పాకిస్థాన్ పొరుగు దేశాలని.. మనం కలిసి జీవించడం నేర్చుకోవాలని నీతులు వల్లించారు. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడానికి ఇండియా ప్రయత్నాలు చేయాలని.. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోతే ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ ఏర్పడవని అన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్-పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తే వారు మూర్ఖుల స్వర్గంలో నివసిస్తున్నట్లేనని పాకిస్తాన్ బుద్ధి ప్రదర్శించారు.
ఇండియా, పాక్ ఇప్పటికే నాలుగు యుద్ధాలు చేశాయని.. ఇందుకు బిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యిందని గుర్తు చేశారు. ఇప్పటికీ కూడా ఇండియా మిత్రదేశంగా ఉండటానికి బదులు పోరాట ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. మనం శాంతియుతంగా జీవించాలా లేదా పోరాటం కొనసాగించాలా అనేది మన ఇష్టమని.. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవిస్తూ జీవించాలనేది పాకిస్తాన్ కోరిక అని ప్రగల్భాలు పలికారు.