వృథాగా మంజీరాలోకి వరద నీరు

వృథాగా మంజీరాలోకి వరద నీరు
  • డెవలప్​ చేస్తే  మరో 5వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి
  • ఎన్నికలప్పుడే ప్రాజెక్టు ఊసెత్తుతున్న  పాలకులు 
  • స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని రైతుల డిమాండ్​

కామారెడ్డి : పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామన్న ప్రభుత్వాల హామీ దశాబ్ధాలు గడుస్తున్నా నెరవేరుతలేదు.   ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలన్న జిల్లా రైతుల డిమాండ్​ ఎవరూ పట్టించుకుంటలేరు. పాలకులు ఎన్నికల టైంలో ప్రాజెక్టు పెంపుపై హామీలిచ్చి ఆ తర్వాత మరచిపోవడం పరిపాటిగా మారింది. మంజీరా నది పక్కన నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టును  నిజాం హయాంలో 1916–-1922 మధ్యకాలంలో నిర్మించారు.  వందేండ్ల కింద 2.43 టీఎంసీల కెపాసిటీతో దాదాపు రూ.27 లక్షల ఖర్చుతో నిర్మించారని పెద్దలు చెప్తారు.   ఈ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో  10,500 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టుతో పాటు కాల్వల్లో నీటి నిల్వతో సమీప గ్రామాల్లో భూగర్భ నీటి మట్టాలు కూడా బాగా ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు 53 కి.మీ. పొడవు కాల్వ, 73 డిస్టిబ్యూటరీలు ఉన్నాయి.  ఏటా వానాకాలం, యాసంగి సీజన్​లో ప్రాజెక్టు నుంచి పంటలకు నీరందుతోంది. ప్రాజెక్టులో పూడిక చేరడంతో ప్రస్తుతం నీటి కెఫాసిటీ 2.43 టీఎంసీల నుంచి  1.8 టీఎంసీలకు చేరింది.  నీటి విడుదల కు ఏ, బీ జోన్లు ఉన్నాయి. 

వందేండ్ల కింద ప్రాజెక్టు కట్టిన్రు..
ప్రాజెక్టు ఎత్తు 21 అడుగులు ఉంది. 100 ఏండ్ల కింద నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు కావడం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కట్టారు.  సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో  ఆయకట్టుకు పూర్తిగా సాగునీరందడం లేదు.  మరో వైపు వర్షకాలంలో  ప్రాజెక్టుకు భారీగా వచ్చే వరద వృధాగా  పోతోంది. ఏటా 2 నుంచి 3 టీఎంసీలకు పైగా నీరు  మంజీరాలో కలుస్తోంది.  ప్రాజెక్టు ఎత్తు పెంచితే  వరద నీరు  ఇక్కడే కొంత వరకైనా స్టోరేజీ  ఉండే అవకాశం ఉంటుంది.  నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే   ప్రస్తుతం ఉన్న  10,500 ఎకరాల ఆయకట్టుకు 2 పంటలకు నీరు అందడంతో పాటు  అదనంగా మరో  5 వేల  ఎకరాల వరకు  ఆయకట్టు పెరిగే అవకాశం ఉందని స్థానిక రైతులు చెప్తున్నారు. మెయిన్​ కెనాల్​  కూడా అధ్వానంగా మారింది. 15  ఏండ్ల కింద ప్రాజెక్టుకు రిపేర్​లో భాగంగా కొంత సీసీ వర్క్స్​చేపట్టారు.   ఎత్తు పెంపుతో పాటు, మెయిన్​ కెనాల్​పూర్తిగా సీసీ చేసి చివరి  ఆయకట్టు వరకు నీరందిస్తామన్నారు. 

హామీలిచ్చినా.. ముందుకెళ్లలే
పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపుపై గతంలో  ఆయా ప్రభుత్వాల పెద్దలు హామీ ఇచ్చారు.   2014, 2018 ఎన్నికల టైంలో  సీఎం కేసీఆర్​ కూడా  పోచారం  ప్రాజెక్టు ఎత్తు పెంచి డెవలప్​చేస్తామని హామీ ఇచ్చారు.  2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో  జిల్లా నాయకులు ప్రాజెక్టు ఎత్తు పెంచాలని డిమాండ్​చేస్తూ పాదయాత్ర చేశారు.  ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ​అప్పట్లో  కాంగ్రెస్​ పార్టీలో  ఉన్నప్పుడు  ప్రాజెక్టు ఎత్తు పెంచి  ఆయకట్టు పెంచాలని డిమాండ్​చేశారు.  ప్రస్తుతం ఆయన  అధికార పార్టీలో ఉన్నారు.  ఎమ్మెల్యే ఇప్పటికైనా ప్రాజెక్టు  అభివృద్ధి విషయంలో  చొరవ చూపాలని జిల్లా రైతులు కోరుతున్నారు.  
డెవలప్​ చేస్తే  మరో 5వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి..

పోచారం ప్రాజెక్టు నిజాం జమానలో కట్టిన్రు. అప్పట్లో  కట్టిన ఎత్తే ఉంది.   ఎత్తు పెంచాలని చాలా రోజుల నుంచి కోరాం. ఎత్తు పెంచితే  ఇంకా ఎక్కువ పొలాలకు నీళ్లు పారుతయ్. ఒక ఏడాది వానలు పడకున్నా ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండి పొలాలకు వస్తయ్ .  
- నారాయణ, రైతు, నాగిరెడ్డిపేట

కాల్వ రిపేర్​ చేయాలి

ప్రాజెక్టు కాల్వ కొన్ని ఏండ్ల కింద సిమెంట్​తో  కొంత వరకు కట్టిన్రు. కానీ చాలా వరకు సిమెంట్​ పోయింది.   చివరి వరకు నీళ్లు అందాలంటే కాల్వలో నీళ్లు సరిగ్గా పోవాలంటే  పూర్తిగా సిమెంట్​తో కట్టాలి. డిస్ట్రిబ్యూటర్లను కూడా బాగు చేయాలి. 

- బాల్​రాజు,  రైతు, ఎల్లారెడ్డి మండలం