పాడి రైతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వట్లే

పాడి రైతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వట్లే
  •     పేరుకుపోయిన  ₹20 కోట్ల బకాయిలు
  •     15 నెలలుగా నల్గొండ, రంగారెడ్డి
  •     రైతుల ఎదురుచూపులు

యాదాద్రి, వెలుగురాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​విజయ డెయిరీ పరిధిలోని పాడి రైతులకు సర్కార్​ తరఫున లీటర్‌‌కు అదనంగా రూ. 4 ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నేఫథ్యంలో మదర్​ డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్​ సొసైటీలకు చెందిన రైతులు తమకు కూడా ₹ 4  ప్రోత్సాహకంగా ఇవ్వాలని డిమాండ్​ చేయడంతో.. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మదర్​ డెయిరీనే సొంతంగా లీటర్‌‌కు ₹ 3 అదనంగా ఇవ్వడం ప్రారంభించింది. ఈ రకంగా దాదాపు ఆరు నెలల పాటు తమ పరిధిలోని రైతులందరికీ రూ. 1.50 కోట్లు అందించింది. ఆ తర్వాత పాడి రైతులు ఆందోళనల నేపథ్యంలో విజయ డైరీతో పాటు మదర్​ డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్​ డెయిరీల్లోని పాడి రైతులందరికీ లీటర్‌‌కు రూ. 4 చొప్పున ఇన్సెంటివ్‌‌ ప్రభుత్వమే ఇస్తుందని సీఎం కేసీఆర్‌‌ 2017 సెప్టెంబర్‌‌లో ప్రకటించారు. ఆ తర్వాత రైతులకు అప్పటివరకు మదర్​డెయిరీ సొంతంగా చెల్లించిన రూ. 1.50 కోట్లు జమ చేశారు.

ఆచరణలో విఫలం

ఇన్సెంటివ్‌‌ ఇస్తానని గొప్పగా ప్రకటించిన సర్కారు ఆచరణలో విఫలం కావడంతో పాడి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 నెలలుగా ఇన్సెంటివ్‌‌ ఇవ్వడం లేదు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో మదర్​డెయిరీకి 25 పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలోని గ్రామాల నుంచి 1,200  కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తోంది. రెండు ఉమ్మడి జిల్లాల్లోని 600 సొసైటీల్లో 43 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా సీజన్‌‌లో రోజుకు 1.55 లక్షల లీటర్లు, అన్ సీజన్‌‌లో రోజుకు 95 వేల లీటర్ల వరకు మదర్ డెయిరీ కేంద్రాల్లో పాలు పోస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ. 1.38 కోట్ల చొప్పున రైతులకు సర్కారు ఇన్సెంటివ్‌‌ ఇవ్వాల్సి ఉంది. మొత్తం 15 నెలల పెండింగ్ కాలానికి ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు సర్కార్‌‌ రూ. 20 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గు

లీటర్‌‌ ఆవు పాలకు రూ. 23.50, బర్రె పాలకు రూ. 27 చొప్పున మదర్​డెయిరీ రైతులకు చెల్లిస్తోంది. సర్కారు ఇస్తానన్న ఇన్సెంటివ్‌‌ రూ. 4 అందిస్తే.. ఆవు పాలు లీటర్‌‌కు రూ. 27.50, బర్రె పాలకు రూ. 31 చొప్పున అందుతుంది. కానీ, సర్కారు నుంచి ప్రోత్సాహకం రాకపోవడంతో రైతులు మదర్​డెయిరీ నుంచి ప్రైవేటు డెయిరీల వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రోత్సాహక ధర కాకుండా మదర్​డెయిరీ లీటర్ పాలకు  చెల్లిస్తున్న సొమ్ము కంటే ఈ ప్రైవేట్‌‌ డెయిరీలు రూ. 2 ఎక్కువగా ఇస్తుండంతో రైతులు ప్రైవేటు డెయిరీలకే పాలను అమ్ముతున్నారు.

గిట్టుబాటు అయితలే..

రోజుకు నాలుగు లీటర్ల పాలు సెంటర్​లో పోస్తాను. పాలకు ఇన్సెంటివ్​ ఇస్తానని సీఎం ప్రకటించిన కొత్తలోనే సర్కారు ఇచ్చింది. దాంతో పైసల్ మంచిగ గిట్టుబాటు అవుతయని ఆశపడ్డా. కానీ, ఆ తర్వాత ఇన్సెంటివ్ ఇయ్యలే.. నా ఆశ తీరలే..

– కొలను మోహన్​రెడ్డి,ఎదుల్లగూడెం పాడి రైతు(వలిగొండ)

ఇవ్వాల్సింది సర్కారే

రైతుల పాల సేకరణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. మేం చెల్లించాల్సిన పాల బిల్లులను లేట్ చేయకుండా చెల్లిస్తున్నాం. లీటర్‌‌కు రూ. 4 చొప్పున ఇన్సెంటివ్‌‌ ఇవ్వాల్సింది సర్కారే. ఈ సొమ్ము నేరుగా పాడి రైతుల ఖాతాకే సర్కారు జమ చేస్తుంది. ఇప్పటివరకు ఇన్సెంటివ్‌‌ సొమ్ము రూ. 20 కోట్ల వరకు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

– రమేశ్, మదర్ డెయిరీ