పాడి రైతులకు ఇన్సెంటివ్​ రావట్లే

V6 Velugu Posted on Feb 16, 2021

  • లక్ష మంది పాడి రైతులకు ఇన్సెంటివ్​ రావట్లే
  • ఈ-ల్యాబ్ లో ఎంట్రీ చేయకపోవడమే కారణం
  • 2018 నుంచి ఈ-ల్యాబ్ సైట్ క్లోజ్.. ఇటీవలే ఓపెన్​
  • అందులో ఎంట్రీ అయితేనే ఇన్సెంటివ్‌కు అర్హత
  • విజయ డెయిరీ తీరుతో రైతులకు రూ.50 కోట్లకు పైగా నష్టం

మంచిర్యాల, వెలుగు: విజయ డైరీ ఆఫీసర్ల తీరుతో రాష్ర్టవ్యాప్తంగా సుమారు లక్ష మంది పాడి రైతులకు గత మూడేళ్లుగా ఇన్సెంటివ్​​రావట్లేదు. 2018 నుంచి ఈ-ల్యాబ్​ సైట్​క్లోజ్​ చేయడంతో, కొత్త మెంబర్లుగా చేరిన రైతులను అందులో ఎంట్రీ చేయలేదు.  దీంతో పాడి రైతులు రూ.50 కోట్లకు పైగా ఇన్సెంటివ్​ నష్టపోయారు.

రూ.4 చొప్పున​..

రాష్ర్ట ప్రభుత్వం 2014లో పాడి రైతులకు లీటర్​ పాలపై నాలుగు రూపాయల చొప్పున ఇన్సెంటివ్​ ప్రకటించింది. విజయ డెయిరీతో పాటు రెండు ప్రైవేట్​ డెయిరీలు, ఒక కో ఆపరేటివ్​ డెయిరీ పరిధిలోని రైతులకు ఈ ఆర్థికసాయం అందిస్తోంది. అందులో కరీంనగర్​ మిల్క్​ ప్రొడ్యూసర్స్​ డెయిరీ, మదర్​ డెయిరీ, ముల్కనూరు కో ఆపరేటివ్​ డెయిరీ ఉన్నాయి. గవర్నమెంట్​ స్కీమ్స్​ కింద పాడి రైతులు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ-ల్యాబ్​లో ఎంట్రీ కావాలి. అందులో ఎంట్రీ కాని వారికి ఇన్సెంటివ్​, పాడిపశువుల పంపిణీతో పాటు ఇతర స్కీములేవీ వర్తించవు. 2018 నుంచి ఈ-ల్యాబ్​ను క్లోజ్​ చేశారు. ఆ తర్వాత మెంబర్లుగా చేరిన రైతులను అందులో ఎంట్రీ చేయలేదు. సదరు రైతులు రెగ్యులర్​గా డెయిరీకి పాలు పోస్తున్నా ఇన్సెంటివ్​ రావట్లేదు. ఇలా రాష్ర్టవ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతులు రూ.50 కోట్లకు పైగా ఇన్సెంటివ్​ నష్టపోయినట్టు తెలుస్తోంది. నిరుడు అక్టోబర్​లో ఈ-ల్యాబ్​ ఓపెన్​ చేసి రైతులను ఎంట్రీ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన మీదట అందించే ఇన్సెంటివ్​ మాత్రమే వీరికి వర్తిస్తుంది. డెయిరీల్లో కొత్తగా మెంబర్లుగా చేరే రైతులను ఎప్పటికప్పుడు ఈ-ల్యాబ్​లో ఎంట్రీ చేస్తూ… పాలు పోయని రైతులను తొలగిస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఈ-ల్యాబ్​ సిస్టమ్​ను మూడేళ్లుగా ఎందుకు క్లోజ్​ చేశారన్నది తెలియట్లేదు. ఈక్రమంలో పాడి రైతులకు రూ.50 కోట్లకు పైగా లాస్​ చేసిన ఆఫీసర్లను గుర్తించి వారిపై యాక్షన్​ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గత మూడేళ్లలో నష్టపోయిన వారికి ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ప్రైవేట్​ డెయిరీలకు రూ.4… విజయ రైతులకు రూ.3?

ప్రభుత్వం పాడి రైతులకు లీటర్​కు నాలుగు రూపాయల చొప్పున ఇన్సెంటివ్​ ప్రకటించడం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాష్ర్టంలోని నాలుగు డెయిరీల పరిధిలోని రైతులకు ఇదే పద్ధతిలో ఇన్సెంటివ్​ చెల్లిస్తోంది. ఇటీవల విజయ డెయిరీకి లాభాలు వచ్చినట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్​లో లీటర్​కు రూపాయి చొప్పున డెయిరీ నుంచి ఇవ్వాలని కోరింది. అంటే విజయ డెయిరీ రైతులకు గవర్నమెంట్​ మూడు రూపాయలు చెల్లిస్తే డెయిరీ రూపాయి చొప్పున భరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవలే సర్కారుకు రూ.12 కోట్లు చెల్లించినట్టు సమాచారం. మిగిలిన మూడు డెయిరీల పరిధిలోని రైతులకు మాత్రం ప్రభుత్వమే నాలుగు రూపాయల చొప్పున చెల్లిస్తుండడం గమనార్హం.

అసలు రైతులకు అందుతున్నది ఎంత…?

ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్సెంటివ్​ పాడి రైతుల్లో ఎంత మందికి అందుతోందనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్​ డెయిరీలు ఈ-ల్యాబ్​లో రైతుల పేర్లను కాకుండా సొసైటీల పేర్లను, వాటి పరిధిలోని రైతుల సంఖ్యను మాత్రమే ఎంట్రీ చేస్తున్నట్టు సమాచారం. ఒక సొసైటీలో వెయ్యి మంది రైతులు ఉంటే ఆ నంబర్​ను మాత్రమే ఎంట్రీ చేస్తాయి తప్ప రైతుల వివరాలు ఉండవు. అందులో అసలైన రైతులు ఎందరు, బోగస్​ రైతులు ఎందరు అన్నది తెలియడం లేదు. అంతేగాకుండా ఒక ప్రైవేట్​ డెయిరీ నిర్వాహకులు ఉమ్మడి కరీంనగర్​, ఆదిలాబాద్, వరంగల్​, నిజామాబాద్, మెదక్​​​ జిల్లాల్లో ​విజయ డెయిరీ డెవలప్​కాకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారనే విమర్శలున్నాయి. వీరికి డెయిరీలోని కొంతమంది ఆఫీసర్లు సైతం సపోర్టు చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజయ డెయిరీ రైతులను తమవైపు రప్పించుకునే ప్లాన్​లో భాగంగా ఇన్సెంటివ్​తో పాటు ఇతర స్కీములు అందకుండా  కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడేళ్ల నుంచి రాలే..  

లక్సెట్టిపేటలోని విజయ డెయిరీకి క్యాతన్​పల్లి స్వయంకృషి మిల్క్​ సొసైటీ ద్వారా పాలు పోస్తున్నం. మా ఊళ్లో సుమారు వంద మంది పాడి రైతులు ఉన్నరు. మూడు సంవత్సరాల నుంచి మాకు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్​ వస్తలేదు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల మేమంతా ఇన్సెంటివ్​ నష్టపోతున్నం. పెద్దసార్లు స్పందించి మాకు న్యాయం చేయాలె.

– వీరమల్ల రాజయ్య, హరిప్రసాద్​, క్యాతన్​పల్లి (మంచిర్యాల జిల్లా)

For More News..

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఆందోళనలో పాల్గొన్నాడని బీజేపీ లీడర్​ ఇల్లు కూల్చివేత

జీవోలు ఇచ్చి.. చెత్తబుట్టలో వేస్తరా?

Tagged milk, Dairy farmers, incentives, vijaya dairy

Latest Videos

Subscribe Now

More News