
హూస్టన్: అమెరికాలోని టెక్సస్‌లో ఘోరం జరిగింది. బొమ్మ తుపాకీ అనుకొని, లోడ్ చేసిన గన్ తీసుకొని ఓ మూడేండ్ల చిన్నారి.. తన నాలుగేండ్ల సిస్టర్‌ను షూట్ చేసింది. ఈ ఘటనలో సిస్టర్ మృతి చెందింది. నార్త్ హూస్టన్ రోడ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. ఇద్దరు పిల్లలతో పాటు మరో ఐదుగురు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎవరి రూమ్‌లో వారు బిజీగా ఉన్నారు. చిన్నారులు ఇద్దరూ ఓ బెడ్రూమ్‌లో ఆడుకుంటున్నారు. అందులో ఓ పాప బొమ్మ తుపాకీ అనుకొని అక్కడే ఉన్న లోడ్ చేసిన గన్ తీసుకొని తన సిస్టర్‌ను షూట్ చేసింది. గన్ సౌండ్ విన్న ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే బెడ్రూమ్‌లోకి పరుగెత్తుకెళ్లారు.
రక్తపు మడుగులో చిన్నారిని చూసి వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశారు. నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది పాపను పరీక్షించి అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారులు ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా, మూడేండ్ల పాపకు లోడ్ చేసిన సెమి ఆటోమెటిక్ పిస్టల్ దొరికింది. అది బొమ్మ తుపాకీ అనుకున్న ఆ పాప ప్రమాదవశాత్తు తన నాలుగేండ్ల సిస్టర్‌ను షూట్ చేసిందని తెలిపారు. ఈ ఘటనలో ఆ పాప మృతిచెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.