-copy_NhLaSm8d09.jpg)
- రూ.49 లక్షల క్యాష్, బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పరారీలో వాచ్‌మన్ కుటుంబం
సికింద్రాబాద్, వెలుగు: వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన నగలు, భారీగా డబ్బు మాయమైన ఘటన సికింద్రాబాద్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధీ కాలనీ పీజీ రోడ్ లోని ఓం శ్రీ అపార్ట్మెంట్లో రాహుల్ గోయెల్, నలుగురు సోదరులతో కలిసి ఉంటున్నాడు. వీరి కుటుంబం రాణిగంజ్‌లో ఐరన్ వ్యాపారం చేస్తోంది. నేపాల్‌కు చెందిన కమల్ ఐదేండ్లుగా వీరి అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి కమల్ అపార్ట్మెంట్ వద్దే ఉంటున్నాడు. రాహుల్ కుటుంబం ఈ నెల 9న సిటీ శివార్లలోని ఫాంహౌస్‌కు వెళ్లింది. సోమవారం తిరిగి ఇంటికొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
అనుమానంతో రాహుల్.. వాచ్‌మన్ కమల్ కోసం వెతకగా కుటుంబంతో సహా అతడు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి బీరువాలో చూడగా.. రూ.49 లక్షల క్యాష్, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు కనిపించలేదు. సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురైందని రాహుల్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్లో పేర్కొన్నాడు. వాచ్‌మన్ కమల్ ఈ చోరీకి పాల్పడి ఉంటారని రాహుల్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.