పొలం కోసం కొడుకు తండ్రిని హతమార్చాడు

పొలం కోసం కొడుకు తండ్రిని హతమార్చాడు

గన్నేరువరం, వెలుగు:  పొలం కోసం కొడుకు తండ్రిని హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అటికం శంకరయ్య(65)కు కొడుకు, కూతురు ఉన్నారు. 20 ఎకరాల పొలం ఉండగా కొడుకు, కోడలు పేరిట పదెకరాలు ఇచ్చాడు. తండ్రితోపాటు కొడుకు రవీందర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిగిలిన భూమి కోసం రవీందర్​తండ్రితో తరచూ గొడవ పడుతుండేవాడు. బుధవారం రాత్రి సైతం తండ్రితో గొడవపడ్డాడు. ఆవేశంతో ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో తండ్రి తలపై దాడి చేసి గాయపరిచాడు.

వెంటనే కుటుంబసభ్యులు చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం  శంకరయ్య చనిపోయాడు. భూమిలో కొంత కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఎస్సై సురేందర్ ​చెప్పారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.