పెన్సిల్వేనియా: అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. తానా సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. తరని పరుచూరి, సతీశ్ వేమన వర్గాలు.. చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నాయి. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన చేసుకుంది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న తానా 23వ మహాసభలను శనివారం పెన్సిల్వేనియాలో ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
అయితే సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆయన పేరును ప్రస్తావనకు తీసుకురావడంతోనే ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇది నచ్చని టీడీపీ మద్దతుదారులు.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడికి దిగారని సమాచారం. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం వారిని విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
