
న్యూఢిల్లీ : అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి విరాళాలు ఇచ్చే వారికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రామమందిరం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80 జి కింద ఇన్ కం ట్యాక్స్ రాయితీ ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఇస్తామని సీబీడీటీ తెలిపింది. దీని ద్వారా రామమందిరం నిర్మాణానికి ఎక్కువగా విరాళాలు వస్తాయని అంచనా వేశారు. అయోధ్య లో రామమందిరం నిర్మించేందుకు 15 మంది సభ్యులతో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు. నిత్య గోపాల్ దాస్ ఈ ట్రస్ట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే రామమందిరం డిజైన్ లోగోను విడుదల చేశారు. రామాలయ నిర్మాణానికి చందాలు ఇవ్వాలంటూ ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు విరాళాలు ప్రకటించాయి.