డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోతుండటం, విదేశీ పెట్టుబడులు దేశం దాటి వెళ్ళిపోతుండటంతో ఎట్టకేలకు మోడీ సర్కార్ కళ్లు తెరిచింది. గతంలో పన్నులు పెంచి విదేశీ ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాము చేసిన తప్పును ఆలస్యంగానైనా తెలుసుకుని యు-టర్న్ తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో అత్యవసరంగా రంగంలోకి దిగిన కేంద్రం.. జూన్ 5న‘ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్ 2026’ను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసిన ఈ ఆర్డినెన్స్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లకు పన్నుల నుంచి భారీ ఊరట లభించింది.
నాడు పన్ను పెంచి తప్పు చేశారు..
నిజానికి ప్రభుత్వ బాండ్లపై విదేశీ ఇన్వెస్టర్లు సంపాదించే వడ్డీ ఆదాయంపై గతంలో కేవలం 5 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్(TDS) ఉండేది. అయితే 2023 జూలైలో మోడీ సర్కార్ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. క్యాపిటల్ గెయిన్స్ పన్నులతో సమానంగా ఉంచాలనే నెపంతో ఆ పన్నును ఏకంగా 20 శాతానికి పెంచేసింది. దాంతో పాటు ప్రభుత్వ బాండ్లను ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచుకుంటే 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, ఏడాది లోపు అమ్మేస్తే 20 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వసూలు చేయడం ప్రారంభించింది. ఈ భారీ పన్నుల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు.
అన్ని పన్నులూ రద్దు.. విదేశీయులకు రెడ్ కార్పెట్
ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మోడీ సర్కార్ తమ పాత పన్ను నిర్ణయాలన్నింటినీ పూర్తిగా రద్దు చేసింది. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FIIs) ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లపై సంపాదించే వడ్డీ ఆదాయంపై ఎలాంటి విత్‌హోల్డింగ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ బాండ్ల అమ్మకం లేదా బదిలీ ద్వారా వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును పూర్తిగా ఎత్తేశారు. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల ఫోరమ్ అయిన ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్’ సంస్థకు కూడా ఇదే పన్ను మినహాయింపును వర్తింపజేశారు. ఈ సవరణలను 'ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025' లోని షెడ్యూల్ IV కు కొత్త కేటగిరీలుగా చేర్చారు.
రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్.. ఏప్రిల్ 1 నుంచే వర్తింపు
ఈ నిర్ణయంలో మరో కీలకమైన అంశం ఏంటంటే.. ఈ ఆర్డినెన్స్ ప్రస్తుత పన్ను ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2026 ఏప్రిల్ 1 నుంచి పాత తేదీతో వర్తిస్తుండటమే. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లపై ఆర్జించిన లాభాలు, వడ్డీలపై ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. సో ఈ నిర్ణయంతో ఇన్నాళ్లుగా భారత మార్కెట్లలో పెట్టుబడులు అంటే పన్నుపోటు భయానికి గురైన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి డాలర్లు కుమ్మరించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే జరగాల్సిన నష్టం జరిగాక ఆలస్యంగా మోడీ సర్కార్ కళ్లు తెరవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
