మూడేండ్లైనా పూర్తి కాని పార్కింగ్ యార్డు పనులు

V6 Velugu Posted on Aug 03, 2021

  • 9 నెలల్లో అయిపోవాలి.. మూడేండ్లైనా పూర్తి కాలె !
  • సిటీలో మెట్రో మల్టీ లెవల్ పార్కింగ్ యార్డులు పెండింగ్​
  • ఇంకా నిర్మాణ దశలోనే నాంపల్లిలోని పైలట్​ప్రాజెక్ట్​
  • వాహనాల రద్దీతో తప్పని పార్కింగ్ ఇబ్బందులు
  • అడ్డగోలుగా చార్జీల వసూళ్లతో అదనపు భారం

హైదరాబాద్, వెలుగు: సిటీలో వాహనాల పార్కింగ్ ఇబ్బందులకు చెక్​పెట్టేందుకు మెట్రో రైల్ సంస్థ చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.  మూడేళ్ల కిందట నాంపల్లి మెట్రో స్టేషన్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. 9 నెలల్లోనే అందుబాటులోకి తెస్తామన్నా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాల రద్దీతో పాటు పార్కింగ్ సమస్య కూడా తీవ్రమవుతోంది. దీనికి ఆధునిక పద్ధతులతో చెక్ పెట్టేందుకు ఎంఏయూడీ (మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​) స్టడీ చేసి వివిధ ప్రాంతాల్లో70కి పైగా పార్కింగ్​ యార్డులను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి దశలో12  సైట్లలో నిర్మించేందుకు మెట్రోరైల్​సంస్థ ముందుకువచ్చి అనుమతులు తెచ్చుకోగా, ఇందులో పైలట్​ప్రాజెక్ట్​గా 2018లో నాంపల్లిలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం చేపట్టింది.

మూడేళ్లుగా సాగుతున్న పైలట్​ పనులు
దాదాపు రూ. 60 కోట్ల అంచనాతో నాంపల్లి మెట్రో స్టేషన్​ వద్ద అర ఎకరం స్థలంలో పీపీపీ ( పబ్లిక్​-– ప్రైవేట్–​- పార్ట్​నర్​షిప్​) పద్ధతిలో ఆధునిక పార్కింగ్ యార్డు నిర్మాణానికి మెట్రో సంస్థ డిజైన్ చేయించడంతో పాటు  పనులకు కూడా చేపట్టింది. 15 ఫ్లోర్ల యార్డులో ఎనిమిది ఫ్లోర్లలో ఒకేసారి 300 కార్లు, 1500 బైకులను పార్కింగ్ చేసేలా రూపొందించింది. పైలట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టినా ఇంకా కంప్లీట్​చేయలేకపోగా, మూడేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కరోనా కంటే ముందే పనులు ఆగిపోగా,  ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు.  అనుకున్న టైమ్​లోనే  పనులు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నా ఏండ్లుగా కొనసాగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

ప్రభుత్వ సహకారం లేకనేనా..
సిటీలో పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఏటా 10 శాతం కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కంటే సొంత వాహనాల్లోనే ఎక్కువగా జర్నీ చేసేందు కు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మల్టీ లెవల్ పార్కింగ్ యార్డులు కీలకంగా మారాయి. అయితే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం లేకపోవడంతోనే పైలట్ ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలుస్తోంది.

అడ్డగోలుగా చార్జీలు
వ్యాలెట్ పార్కింగ్ పేరిట అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. బైక్​కు రూ. 20, కారుకు రూ. 50పైనే ఉంది.  అబ్సిడ్, హిమయత్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎల్​బీనగర్​, కూకట్ పల్లి, గచ్చిబౌలి వంటి కమర్షియల్ ఏరియాల్లో అనధికారిక పార్కింగ్ ​యార్డు లే ఎక్కువగా ఉన్నాయి. మెట్రో స్టేషన్లకు వచ్చే వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండగా రక్షణ లేకుండా పోయిందని యజమానులు పేర్కొంటున్నారు. మరో వైపు చిన్న సినిమా థియేటర్ల మేనేజ్​మెంట్లు పార్కింగ్ చార్జీలను వసూలు చేసుకోవచ్చ ని కొద్దిరోజుల కిందట ప్రభుత్వం ఆదేశాలి వ్వడంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.  అధికారిక పార్కింగ్ యార్డుల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా, ఇలా అదనపు భారం మోపేలా చర్యలు తీసుకోవడమేంటని వాహన, ట్రాఫిక్ రంగ నిపుణులు ప్రశ్ని స్తున్నారు.  మల్టీ లెవల్ పార్కింగ్ ప్రతిపాదనలు కాగితాల్లోనే ఉండగా, సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్ల కు వచ్చే ప్రయాణికులు, ఇతర వాహనదా రులకు పార్కింగ్ ఇబ్బందులు తొలగట్లేదు.

Tagged Hyderabad, parking, trafficjam, Parking Charges, parking yards, multilevel parking yards

Latest Videos

Subscribe Now

More News