కేయూసీ 100 ఫీట్ల రోడ్డులో పూర్తికాని పనులు

కేయూసీ 100 ఫీట్ల రోడ్డులో పూర్తికాని పనులు
  • ఆరు నెలలుగా రాస్తా బంద్, ఇక్కట్లు పడుతున్న జనం
  • చిరు వ్యాపారులకు భారీగా నష్టాలు
  • కెనాల్​ను తలపిస్తున్న కిలోమీటరున్నర రోడ్డు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ టు కాజీపేట వయా కేయూసీ 100 ఫీట్ల రోడ్డు నిత్యం జనంతో బిజీగా ఉంటుంది. మెజారిటీ కాలనీలకు మెయిన్ రూట్ ఇదే. స్కూళ్లు, కాలేజీలకు తోడు వరంగల్‍, కాజీపేట రైల్వే స్టేషన్లకు వెళ్లే మార్గమిది. వందలాది మంది చిరువ్యాపారులు ఈ రోడ్డు మీదే వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఈ రూట్​లో ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అటు ప్రజలతో పాటు ఇటు వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఇదీ సంగతి..

వరదలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ, డక్ట్ పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. గోపాల్‍పూర్‍ ఊర చెరువు నుంచి సమ్మయ్యనగర్‍ ప్రెసిడెన్సీ స్కూల్‍ వరకు 1.4 కిలోమీటర్ల మేర అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ కమ్‍ డక్ట్ పనులు చేపట్టారు. గతేడాది పనులు ప్రారంభించిన ఓ ప్రైవేట్ కంపెనీకి మే 31లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ విధించారు. తీరాచూస్తే అనుకున్న గడువుదాటి రెండు నెలలు కావొస్తున్నా పనులు పూర్తి కాలేదు. ఈలోపు వర్షాలు మొదలయ్యాయి. దీంతో సమ్మయ్య నగర్‍, టీవీ టవర్‍ కాలనీ, కేయూ, అమరావతి నగర్‍, వాంబే కాలనీ, ఆదర్శనగర్‍, గోపాల్‍పూర్‍ తదితర కాలనీల జనాలు బిక్కుబిక్కుమంటూ పక్కనుండే తోవలో ప్రయాణిస్తున్నారు.  

కెనాల్‍లా.. 

కేయూసీ సమ్మయ్య నగర్‍ నుంచి గోపాల్‍పూర్‍ ఊర చెరువు వరకు పనులు మొదలుకావడానికి ముందు.. విశాలమైన 100 ఫీట్ల డాంబర్‍ రోడ్‍, మధ్యలో డివైడర్లు, పచ్చని చెట్లు, సెంట్రల్‍ లైటింగ్‍ ఉండేది. ఇప్పుడి ప్రాంతం కెనాల్‍ను తలపిస్తోంది. అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ చేపట్టే క్రమంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయి. రోడ్లు, డివైడర్లు తొలగించి.. మెయిన్‍ రోడ్‍ మొత్తం దాదాపు రెండు, మూడు ఫోర్ల లోపలకు తవ్వారు. కన్‍స్ట్రక్షన్‍ కంపెనీ పనిని మరో 15 నుంచి 20 మందికి సబ్‍ కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో కొన్నిచోట్ల స్లాబ్‍ నిర్మాణం వరకు పూర్తవగా చాలాచోట్ల పెండింగ్‍లో ఉన్నాయి. దీంతో వర్షం కురిసిందంటే చుట్టూపక్క కాలనీల జనాలు భయపడుతున్నారు.

చిరువ్యాపారులు.. లక్షల్లో అప్పులపాలు

అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు జరుగుతున్న కిలోమీటరున్నర దూరంలో రోడ్డుకు ఇరువైపులా షాపింగ్ మాల్స్​తో పాటు వందలాది మంది చిరు వ్యాపారం నడిపించేవారు. పనుల వల్ల ఇప్పుడవన్నీ దాదాపు మూతపడ్డాయి. ఈ ప్రాంతం నుంచి జనాల రాకపోకలు లేకపోవడానికితోడు షాపు ముందు మట్టి తవ్వకాలు జరపడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. బిజినెస్‍ లేకున్నా ఆరేడు నెలల షట్టర్‍ కిరాయిలకు రూ.లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సు, ఆటోల ద్వారా కేయూసీ నుంచి వడ్డెపల్లి చౌరస్తా వెళ్లే ప్రయాణికులు గతంలో ఐదు నిమిషాల్లో చేరుకోగా.. ఇప్పుడు కేయూసీ నుంచి గోపాల్‍పూర్‍ ఊరు అవతల జవహర్‍ కాలనీ మీదుగా వెళుతుండటంతో అరగంట పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఉండే స్కూళ్లలో చదివే పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఐదారు కాలనీలు దాటి వెళుతున్నారు. కాగా, లీడర్లు, ఆఫీసర్లు ఎప్పటిలానే పనులు త్వరలో కంప్లీట్‍ అయ్యేలా చూస్తామంటున్నారు తప్ప దానిని అమలులో చూపట్లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.