- ఆదాయం పెంచుకునేందుకు డిస్కంల ఎత్తుగడ
- కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ ఎడాపెడా బాదుడు
- పది రెట్లపైనే పెరిగిన బిల్లులు చూసి జనం లబోదిబో
- సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కి నిరసనలు
- డెవలప్‌మెంట్ చార్జీలు రద్దు చేయాలంటూ డిమాండ్
హైదరాబాద్/నెట్‌వర్క్, వెలుగు: విద్యుత్ సంస్థలు డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో కరెంటు బిల్లుల మోత మోగించాయి. రూ.11 వేల కోట్ల లోటును పూడ్చుకునేందుకు జనంపై విరుచుకుపడ్డాయి. ముందుగా చెప్పకుండా, ఎలాంటి అవగాహన కల్పించకుండా కరెంటు కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ మామూలు చార్జీలకు పది రెట్లకు పైగా బాదేశాయి. డెవలప్‌మెంట్ చార్జీల విషయంలో గతంలో ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 50 శాతం రాయితీ ఇచ్చినా.. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో మాత్రం 100 శాతం వసూలు చేశారు. కరీంనగర్ జిల్లాలో రూ.133 విలువైన కరెంట్ కాల్చిన ఓ వినియోగదారుడికి డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ కలిపి ఏకంగా రూ.3,409 బిల్లు వేశారు. ఎన్పీడీసీఎల్పరిధిలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 32,935 మంది వినియోగదారుల నుంచి సుమారు రూ.12 కోట్లు పిండుకున్నారు. దీంతో కడుపుమండిన జనం సర్కారు తీరును నిరసిస్తూ మంగళవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆందోళనకు దిగారు.
ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల ఆధారంగా ఎన్ని కిలోవాట్ల కెపాసిటీ కనెక్షన్ కావాలనేది కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడే యూజర్ డిసైడ్ చేసుకోవాలి. ఆ కెపాసిటీ ఆధారంగానే విద్యుత్ సంస్థలు.. డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్స్ కట్టించుకుని కనెక్షన్ ఇస్తాయి. డొమెస్టిక్ విభాగంలో చాలామంది ఒకటి లేదా రెండు కిలోవాట్ల కెపాసిటీ కనెక్షన్లు తీసుకొని.. ఆ మేరకే డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్స్ చెల్లించారు. వినియోగదారులకు విద్యుత్‌అధికారులు, స్టాఫ్ ఎలాంటి అవగాహన కల్పించలేదు. ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సంఖ్య పెరిగినప్పుడు దాంతోపాటే కరెంట్ కనెక్టెడ్ లోడ్ పెరుగుతుంది. ఒక కిలోవాట్ కెపాసిటీ కనెక్షన్మాత్రమే ఉండి.. అంతకుమించి కరెంట్ వాడినప్పుడు ఆ వినియోగదారుడు రెండు లేదంటే మూడు కిలోవాట్ల కేటగిరీలోకి వస్తున్నాడు. అలా మిగిలిన కిలోవాట్, రెండు కిలోవాట్లకు సంబంధించిన డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్స్‌ను ఈ నెల బిల్లులో కలిపి వేస్తున్నారు.
చార్జీలు అప్పుడు .. ఇప్పుడు..
ప్రస్తుతం డొమెస్టిక్ విభాగంలో ఒక కిలోవాట్ కెపాసిటీకి జీఎస్టీతో కలిపి రూ.1,400, రెండు కిలోవాట్లకు రూ.2,800, ఒక కిలోవాట్ కమర్షియల్ కనెక్షన్‌కు రూ.2 వేలు, రెండు కిలోవాట్లకు రూ.5 వేల చొప్పున విద్యుత్ సంస్థలు డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో సుమారు 63 లక్షల ఎల్‌టీ (లో టెన్షన్) కనెక్షన్లు ఉండగా, దాదాపు 50% వినియోగదారులపై చార్జీల మోత మోగినట్లు తెలుస్తోంది. ‘‘మేం కనెక్షన్ తీసుకున్నప్పుడు డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ తక్కువగా ఉన్నాయి. తర్వాత పెంచిన డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ను పాత కనెక్షన్లకు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం” అని జనం ప్రశ్నిస్తున్నారు. రెండేండ్ల కిందట ఎస్‌పీడీసీఎల్ పరిధిలో ఒక కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున డెవలప్‌మెంట్ చార్జీలు డిసైడ్ చేసి, అందులో 50% రాయితీ ఇచ్చారు. రూ.600 చెల్లించిన వాళ్లను రెగ్యులరైజ్చేశారు. ఇప్పుడు ఎన్‌పీడీసీఎల్ పరిధిలో రాయితీ లేకుండా 100% వసూలు చేస్తున్నారు.
రూ.11 వేల కోట్ల లోటు పూడ్చుకోవడానికేనా?
2022–23 ఫైనాన్షియల్ ఇయర్‌లో తమకు రూ.53,053 కోట్లు అవసరాలు ఉండగా, వసూళ్ల ద్వారా రూ.36,474 కోట్లు వస్తాయని ఇటీవల ఈఆర్‌సీకి ఇచ్చిన నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.5,652 కోట్లు ఇస్తే నికరంగా రూ.10,928 కోట్ల లోటు ఉందని అంచనా వేశాయి. ఈ లోటును పూడ్చుకునేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుత కెపాసిటీ కంటే అరగంట ఎక్కువ కరెంట్ వాడినా సరే రీడింగ్ మీటర్ డిమాండ్ (ఆర్‌ఎండీ)ని బేస్ చేసుకుని కరెంట్ కనెక్టెడ్ లోడ్ పెరిగిందని తేల్చేస్తున్నారు. ఇదేమంటే సబ్‌స్టేషన్ల వద్ద రెండు నెలలపాటు డిస్‌ప్లే చేశామని, ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని, దీంతో అందరూ ఒప్పుకున్నట్లుగా భావించి బిల్లుల్లో వేస్తున్నామని చెబుతున్నారు. ఒక్కసారి డెవలప్మెంట్చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ కట్టేస్తే కరెంట్కనెక్షన్ కెపాసిటీ అందుకు అనుగుణంగా ఒక కిలోవాట్ నుంచి రెండు కిలోవాట్లకు, మూడు కిలోవాట్లకు పెరుగుతుందని, తర్వాత మళ్లీ ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వినియోగదారుల కనెక్టెడ్ లోడ్ పెరిగినందున ఆ మేరకు ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీని పెంచాల్సి ఉందని, ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలను అందుకు వినియోగిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
15 జిల్లాల్లో బాదుడు
వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కరెంటు వినియోగదారులకు డెవలప్‌మెంట్ చార్జీల మోత మోగింది. తక్కువ యూనిట్లు వాడినా బాదుడు మాత్రం తప్పలేదు. 14 యూనిట్లు కరెంటు వాడిన వాళ్లకు రూ.3,308.. 53 యూనిట్లు వాడిన వాళ్లకు రూ.3,337.. 60 యూనిట్లు వాడిని వారికి రూ.3,36వచ్చాయి. దీంతో డెవలప్‌మెంట్ చార్జీలను రద్దు చేయాలంటూ జనం రోడ్డెక్కుతున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలోని 12వ వార్డుకు చెందిన ప్రజలు అదనపు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ట్రాన్స్‌కో ఏఈని నిలదీశారు.
ఒక ఇంటి బిల్లు.. రూ.3.21 కోట్లు
మహబూబాబాద్, వెలుగు: ‘డెవలప్‌మెంట్ చార్జీల’ బాధితుల కథ ఒక ఎత్తయితే.. ఈయన కథ ఇంకో ఎత్తు. వందో వెయ్యో కాదు.. రూ.3.21 కోట్లు కరెంటు బిల్లు వేసిన్రు ఆఫీసర్లు. బిల్లు చూసి ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. మహబూబాబాద్‌లో బొల్లం నాగేశ్వరరావుకు చెందిన అపార్ట్‌మెంట్‌ను శ్రీరంగం కిరణ్ ఈమధ్యే కొన్నాడు. అతనికి ప్రతినెలా బిల్లు రూ.200 వరకు వస్తుండేది. జనవరి బిల్లు రూ.3,21,05,218 వచ్చింది. విషయం మీడియాలో రావడంతో తప్పు తెలుసుకున్న విద్యుత్ ఆఫీసర్లు బిల్లును సరిచేశారు. కొత్త బిల్లులో రూ.175 వచ్చింది. మిషన్‌లో సాంకేతిక లోపంతో అలా జరిగిందని మహబూబాబాద్ ఈఆర్‌వో రమేశ్ చెప్పారు.
ఎక్కువ వాడినందుకే..
కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఉన్న లోడ్ కంటే ఇప్పుడు వాడుతున్న లోడ్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే నోటీసు ఇచ్చి చార్జీలు వసూలు చేస్తున్నాం. కిలోవాట్‌ను బట్టి డెవలప్‌మెంట్ చార్జీలు ఉంటాయి. ఎలాంటి వివాదం ఉన్నా ఏడీఈకి, ఏఈకి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్లు ఇన్‌స్పెక్షన్ చేసి కరెంటు ఎన్ని కిలోవాట్లు కాలుస్తున్నరో తేలుస్తరు.
- సంధ్యారాణి, డైరెక్టర్, ఎన్‌పీడీసీఎల్
53 యూనిట్లకు 7 వేలా?
కరీంనగర్ అంబేద్కర్ నగర్‌లో ఉంటున్నం. మాకు కరెంటు బిల్లు రూ.500 మించి వచ్చేదికాదు. కానీ ఈనెల బిల్లు చూస్తే భయమైంది. 53 యూనిట్లు మాత్రమే వాడినం. కానీ రూ.7,344 బిల్లు వేసిన్రు. ఇందులో డెవలప్‌మెంట్ చార్జీల కింద రూ.4,248, ఎస్‌డీ కింద రూ.2,400, ఫిక్స్‌డ్ చార్జీల పేరుతో రూ.240 వేశారు. ఇట్లా బిల్లులు వేస్తే సామాన్యులు ఎట్ల బతకాలె.
- మహ్మద్ అమీర్, కరీంనగర్
