
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ సీఎం కేసీఆర్ ఫైల్‌పై శనివారం సంతకం చేశారు. పెరిగిన డైట్ చార్జీలు జులై నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
3 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ. 950 డైట్ చార్జీలు రూ. 1200కు, 8 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగింది.
అదేవిధంగా 11 వ తరగతి నుంచి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 కు పెరిగింది. కాగా, డైట్ చార్జీల పెరుగుదలపై సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది
స్టూడెంట్ల మెస్‌చార్జీల పెంపు హర్షణీయం
రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వందల సార్లు ధర్నాలు చేసినా రూ.50 కూడా పెంచలేదని గుర్తుచేశారు. తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థుల మెస్‌చార్జీలను భారీగా పెంచిందని తెలిపారు.