ఐదేండ్లుగా జీతాలు పెంచుతలే

ఐదేండ్లుగా జీతాలు పెంచుతలే
  • ఐదేండ్లుగా ఐఈఆర్టీపీలకు,మూడేండ్లుగా కోఆర్డినేటర్లు,సీఆర్పీలు, ఆపరేటర్లకు పెరగలే
  • బడ్జెట్ తగ్గడంతో ఈసారీ జీతాల పెంపు కష్టమే అంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈసారి కూడా జీతాలు పెరిగే అవకాశాలు కన్పించడం లేదు. గతేడాది మాదిరే రాష్ర్ట ప్రభుత్వం వేతనాల ప్రపోజల్స్ పంపించగా, కేంద్రం గతంలో ఇచ్చినంతే ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఏండ్ల నుంచి జీతాలు పెరగక ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు.

ఏండ్ల నుంచీ చాలీచాలని జీతాలే..

రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పరిధిలో 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వివిధ పోస్టుల్లో ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారికి చాలీచాలని జీతాలే ఇస్తున్నారు. ఎస్ఎస్ఏ పరిధిలోని కేజీబీవీల్లో పనిచేసే ఎస్ఓ, సీఆర్టీలు మినహా మిగిలిన ఉద్యోగులందరికీ రూ.15 వేలు, అంతకన్న తక్కువ వేతనాలే ఉన్నాయి. 2020–21 అకడమిక్ ఇయర్ కు గాను రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,285 కోట్లు ఇచ్చేందుకు పీఏబీ సమావేశంలో అంగీకరించింది. దీంట్లో రూ.1,457 కోట్లు నేరుగా ఇచ్చేందుకు కమిట్‌మెంట్ ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్ కింద రాష్ర్టానికి కేంద్రం ఇస్తున్న నిధుల నుంచి స్టేట్ గవర్నమెంట్ ద్వారా తీసుకోవాలని సూచించింది. దీంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. గతేడాది అప్రూవ్ చేసిన బడ్జెట్ కూడా సరిగా ఇవ్వని రాష్ర్ట ప్రభుత్వం, 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులను ఇస్తుందా? అన్న అనుమానం మొదలైంది.

ఏపీలో పెంచినా.. ఇక్కడ పెంచలే..

రాష్ర్టంలో ఐఈఆర్సీ(భవితా) కేంద్రాల్లో 797 మంది ఐఈఆర్పీలు పనిచేస్తున్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వం మాత్రం వీరంతా 1,186 మంది ఉన్నారని కేంద్రం నుంచి నిధులు తీసుకుంటోంది. దీంతోపాటు నెలకు రూ.16,500 ఇస్తున్నట్టు చెప్తూ, సిబ్బందికి మాత్రం రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారు. వీరికి ఐదేండ్ల నుంచీ జీతాలు పెరగడం లేదు. పక్కనున్న ఏపీలో మాత్రం రూ.23 వేలు ఇస్తున్నట్టు ఐఈఆర్పీలు చెప్తున్నారు. ఎంఐఎస్ కోఆర్డినేటర్లు (467మంది), సీఆర్పీలు(2,200 మంది),  డీపీఓ కంప్యూటర్ ఆపరేటర్ల(467మంది)కు మూడేండ్ల కింద జీతం రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత పెంచలేదు. కానీ ఏపీలో వీరందరికీ రూ.23,500 వేతనం అందుతోంది.

ఈసారి కొంతైనా పెంచాలె..

రాష్ట్రంలో మెస్సెంజర్లు, పీటీఐలు, ఐఈఆర్సీ ఆయా లు, మండల కేంద్రాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా నామమాత్రపు జీతాలే ఉన్నాయి. ఈసారి తప్పకుండా జీతాలు పెరుగుతాయని ఆశించిన వీరందరికీ, కరోనా ఎఫెక్ట్ చూపించి ఈసారీ పెంచొద్దనే భావనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ కూడా తక్కువగా పెడుతుండటంతోనే సమస్య ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొంతైనా జీతాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.