
తమ సంస్థపై ఉద్యోగులకు మరింత నమ్మకం, అభిమానం పెరగడానికి కంపెనీలు వారి జీతాలతోపాటు ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్(ఈసాప్స్) ఇస్తున్నాయి. ఫలితంగా వారి సంపద భారీగా పెరుగుతోంది. కంపెనీలు ట్యాలెంట్‌ను నిలుపుకుంటూ, పన్ను ప్రయోజనాలనూ పొందుతున్నాయి.
న్యూఢిల్లీ: చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. సంస్థ ఎదుగుదలకు ఇది కీలకమని నమ్ముతాయి. అందుకే వారికి వీలైనంత ఎక్కువ మేలు చేస్తాయి. ఇందుకోసం అనేక మార్గాలను ఎంచుకుంటాయి. వీటిలో ఉద్యోగుల వ్యక్తిగత సంపదను పెంచడం ఒకటి. ముఖ్యంగా ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీలు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి డాట్‌కామ్ యుగంలో ఈ విధానాన్ని మొదలుపెట్టాయి. ఇప్పుడు చాలా కంపెనీలు ఈక్విటీ ఆధారిత ఇన్సెంటివ్‌లను, బహుమతులను అందజేస్తున్నాయి. మంచి పనితీరు కనబరిచే ఉద్యోగుల్లో ఇట్లాంటివి మరింత జోష్‌ను నింపుతాయి. అదే కంపెనీలో కొనసాగేలా (లాయల్టీ) చేస్తాయి. ఈ ఇన్సెంటివ్‌లు అనేక రూపాల్లో ఉంటాయి. లాభంలో వాటా ఇవ్వడం, ప్రయోజనాల్లో వాటాలు ఇవ్వడం, బ్రాడ్ బేస్డ్ స్టాక్ ఆప్షన్స్, ఈసాప్స్ వంటివి ముఖ్యమైనవి. ఈ ట్రెండ్ ప్రధానంగా ప్రైవేట్ కంపెనీల్లో, స్టార్టప్‌లలో ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలూ మారుతున్నాయి. ఉద్యోగి అవసరాలకు, కోరికలకు తగ్గట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. వృద్ధి ఎక్కువగా ఉండే సంస్థల్లో ఉద్యోగులు లాభాన్ని లేదా సంస్థలో వాటాలను కోరుతున్నారు. స్టార్టప్‌లలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
కంపెనీకి తమను తాము పెద్ద ఆస్తిగా భావించే ఉద్యోగుల నుంచి ఇట్లాంటి డిమాండ్స్వస్తాయి. అన్ని సైజుల కంపెనీలు ఈసాప్‌లను అందిస్తున్నాయి. సాధారణంగా మంచి పనితీరు లేదా సంస్థతో సుదీర్ఘ కాలంలో ఉన్నందుకు వీటిని బహుమతిగా ఇస్తారు. ఈక్విటీ- ఆధారిత ఇన్సెంటివ్స్ ఇవ్వడం మంచి ఆలోచన అని, దీనివల్ల తామూ కంపెనీలో వాటాదారులమేననే ఆలోచన ఉద్యోగుల్లో వస్తుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఈసాప్‌లను స్పాన్సర్ చేసే కంపెనీతోపాటు ఉద్యోగులకూ అనేక పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను, వాటాలను పొందుతారు. కంపెనీల బిజినెస్ పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఈసాప్‌లు ఉద్యోగులపై పాజిటివ్ ఎఫెక్ట్‌ను చూపుతాయి. అత్యుత్తమ పనితీరును సాధించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే కంపెనీ విజయం సాధిస్తే.. అందులో తమకూ వాటా ఉంటుంది. ఉద్యోగులు కూడా ఈసాప్‌లను వారి కృషికి గుర్తింపుగానో, మెచ్చుకోలుగానో చూస్తారు.
ఊపందుకున్న ఈసాప్ బైబ్యాక్స్
కంపెనీ బైబ్యాక్‌ని అమలు చేసినప్పుడు లేదా ఐపీఓకు వెళ్లినప్పుడు కూడా ఈసాప్‌లు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తాయి. స్టాక్ - బాగాపెరిగితే ఉద్యోగులకు భారీగా లాభాలు వస్తాయి. ఈసాప్ బైబ్యాక్ అనేది ట్రెండ్‌గా మారింది. దీనిని 2018లో ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. అప్పటి నుంచి, ఇతర స్టార్టప్‌లు కూడా ఈసాప్ బైబ్యాక్‌లను ప్రకటించడం ప్రారంభించాయి .- పోటీ మార్కెట్‌లో అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి, ఆకర్షించడానికి మల్టిపుల్ రౌండ్స్‌లో ఈసాప్స్‌ను బైబ్యాక్ చేసిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం, పలు సంస్థలలోని ఉద్యోగులు 2020 సంవత్సరంలో ఈసాప్ బైబ్యాక్ ద్వారా రూ.500 కోట్లు సంపాదించారు.
భారతదేశంలో ఈసాప్ బైబ్యాక్‌ల విలువ 2021 సంవత్సరంలో 440 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఉద్యోగులను మెప్పించడానికి, ఈక్విటీ డైల్యూషన్‌ను ఆపడానికి స్టార్టప్‌లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈసాప్ బైబ్యాక్‌లు ఇతర దేశాలలో కూడా చాలా సాధారణం. ఉదాహరణకు, ఆగ్నేయాసియాలోని అనేక పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల రాజీనామాలను ఆపడానికి ఈసాప్‌లను అందిస్తాయి. జపాన్‌లో లిస్ట్ అయిన సంస్థలలో 91 శాతం ఈసాప్‌లను ఇస్తాయి. ఇవి సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈసాప్‌లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్‌లలో కూడా పాపులర్ అయ్యాయి. అక్కడ టెక్ కంపెనీల నుంచి ప్రతిభకు డిమాండ్ ఉన్నప్పటికీ ఉద్యోగులు తక్కువగా ఉన్నారు.