కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్న రోడ్డు ప్రమాదాలు

కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్న రోడ్డు ప్రమాదాలు

రాష్ట్రంలో హైదరాబాద్ నగరం రోడ్డు ప్రమాదాల విషయంలో మొదటి స్థానంలో ఉండగా, ఖమ్మం, వరంగల్ జిల్లాలు మూడు, నాలుగు స్థానాలలో ఉన్నాయి. గత ఐదేళ్ళ నుంచి జిల్లాలో సగటున ఏడాదికి 2వేల నుంచి 2500 వరకు ప్రమాదాలు జరుగుతుండగా... 2020-21లో 3 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయి.  ఖమ్మం జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక్క చోట రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఎందరో గాయపడి హాస్పిటల్స్ లో చేరుతూ కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. రోడ్లపై భారీగా గుంతలు ఉండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న కోట్ల రూపాయలతో నాసిరకం రోడ్డు పనులు చేస్తున్నారు కాంట్రాక్టర్లు.  రోడ్లు వేసిన పది నెలలు కాకముందే గుంతలు పడుతున్నాయంటున్నారు జనం.

ఖమ్మం నుంచి భద్రాచలం, సత్తుపల్లి, వైరా నుంచి మధిర, ఖమ్మం నుంచి తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఇల్లెందు మెయిన్ రోడ్స్ లో ద్విచక్రవాహనదారులతో పాటు, ఆటోలు, బస్సులు, లారీల ప్రమాదాలు జరుగుతున్నాయి. మెయిన్ రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే దారుల్లో కూడా ప్రమాదాల హెచ్చరిక బోర్డులు లేవు. మూల మలుపులు, కల్వర్టుల దగ్గర సైన్ బోర్డులు లేకపోవడంతో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తున్నారు. మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అధికారులను మందలించినా... వారి పనితీరులో మార్పు రావట్లేదు. చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ చిత్తడి కావడంతో వెహికిల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలు లోపించడమే ఇందుక్కారణంగా తెలుస్తోంది. ఫుట్ పాత్ లు అపరిశుభ్రంగా ఉండటం, చెత్తా చెదారాలతో నిండటంతో పాదచారులు నడిచేందుకు వీల్లేని పరిస్థితి ఉంటోంది. రోడ్ల పక్కన కొందరు వ్యర్థపదార్థాలు వేస్తుండటంతో ఎక్కడ చూసినా డంపింగ్ యార్డులుగా మారాయి.

ఖమ్మం బైపాస్ నుంచి సత్తుపల్లి వరకు వెళ్లే రోడ్డుకి రెండు వైపులా వ్యర్థాలు వేశారు. దాంతో రోడ్డు విస్తరణ తగ్గిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు వరకూ 400 మందికి పైగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తిరుగుతున్నా... ఎవరికీ పట్టడం లేదు. కొందరు వాహనదారులు మద్యం తాగి మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన రవాణా శాఖాధికారులు ఏమీ పట్టించుకోవట్లేదు. నగరం లోపల హెల్మెట్, మాస్క్, రాంగ్ రూట్ లాంటి కారణాలతో చలానాలు వేసే పోలీస్ అధికారులు.. నగరం దాటాక ఓవర్ స్పీడ్ వెళ్ళే వాహనాలను పట్టించుకోవట్లేదు.

మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలిసినా... పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, రవాణా శాఖల అధికారులు పనిచేయాలని ఖమ్మం జిల్లా జనం కోరుతున్నారు.